47 చోట్ల టఫ్​ ఫైట్ : ఎంపీపీ పదవుల కోసం పోటా పోటీ

47 చోట్ల టఫ్​ ఫైట్ : ఎంపీపీ పదవుల కోసం పోటా పోటీ

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలోని 47 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెరి సమానమైన సీట్లు రావటం, రిజర్వేషన్లు కలిసి రాకపోవటం,  కొన్నిచోట్ల ఇండిపెండెంట్లు, రెబల్స్ సత్తా చాటడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవటంతో ప్రధాన పార్టీలన్నీ మండలాధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు ఇప్పటికే బేరసారాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటు కీలకం కావటంతో అన్ని మండలాల్లో పార్టీలు ఎన్నికల కోడ్​ను ఉల్లంఘిస్తూ పోటాపోటీగా తమ సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లకు గాలం వేసి  ప్రలోభాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. మండలంలో ఉన్న మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో సగానికి పైగా సభ్యుల మెజారిటీని దక్కించుకున్న పార్టీ నుంచి ఓ అభ్యర్థి ఎంపీపీగా ఎన్నికవుతారు. చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలను బట్టి రాష్ట్రంలో అత్యధిక ఎంపీపీలను టీఆర్​ఎస్​ కైవసం చేసుకోనుంది. మొత్తం 534 ఎంపీపీ స్థానాల్లో 419 టీఆర్​ఎస్​, 55 కాంగ్రెస్​, 4 బీజేపీ, ఇతరులు తొమ్మిది చోట్ల మండలాధ్యక్ష పదవులను దక్కించుకునే అవకాశాలున్నాయి. మిగతా 47 మండలాల్లో ఇండిపెండెంట్ల మద్దతు..  చివరి నిమిషం వరకు కొనసాగే బేరసారాలే కీలకంగా మారనున్నాయి.

534 మండలాల్లోనే ఎన్నిక

రాష్ట్రంలో మొత్తం 538 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. కానీ.. 534 చోట్ల శుక్రవారం ఎంపీపీ ఎన్నికలు జరుగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీ పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలో ఇద్దరే ఎంపీటీసీలు ఉన్నందున అక్కడ ఎంపీపీ ఎన్నిక నిర్వహించటం లేదు. నాగర్‌‌కర్నూల్‌ జిల్లా గగ్గలపల్లిలో ఎంపీటీసీగా పోటీ చేసిన అభ్యర్థికి డబ్బులిచ్చినట్లు (మొదటి పేజీ తరువాయి)

కలెక్టర్​కు ఫిర్యాదు చేయటంతో.. అక్కడి ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది.

ఈ మండలాల్లో టఫ్​

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఎనిమిది సీట్లుంటే.. మూడు టీఆర్​ఎస్, మూడు కాంగ్రెస్​, రెండు ఇండిపెండెంట్​ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఒక ఇండిపెండెంట్​ను​ టీఆర్​ఎస్, మరో ఇండిపెండెంట్​ను కాంగ్రెస్​ క్యాంపునకు తరలించినట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లా లక్సెట్టిపేటలో టీఆర్​ఎస్, కాంగ్రెస్ చెరో నాలుగు సీట్లు గెలవటంతో టఫ్​ పైట్​ తలెత్తింది.

నిర్మల్​ జిల్లాలోని లోకేశ్వరం మండలం ఎంపీపీ ఎస్సీకి రిజర్వు అయింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఒకే ఒక్క ఎస్సీ క్యాండిడేట్​ ఓడిపోవటంతో ఇండిపెండెంట్‍ అభ్యర్థికి అవకాశం దక్కనుంది. ఇదే జిల్లా భైంసాలో ప్రధాన పార్టీలకు స్పష్టమైన అధిక్యం లేకపోవటంతో ఇక్కడ ఎంపీపీ సందిగ్ధంలో పడింది.

కామారెడ్డి జిల్లాలో దోమకొండ, జుక్కల్​, నాగిరెడ్డిపేట, రామారెడ్డి మండలాల్లో  రెండు పార్టీలకు స్పష్టమైన మెజారిటీ లేదు. కరీంనగర్​ జిల్లాలోని చొప్పదండి మండలంలో బీజేపీ నాలుగు ఎంపీటీసీలు గెలుచుకున్నప్పటికీ.. ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు సరిపడే మెజారిటీ సభ్యుల బలం లేదు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ చెరి సగం సీట్లు గెలుచుకున్నాయి. దీంతో ఇక్కడ పోటీ ఉత్కంఠ రేపుతోంది.

మహబూబాబాద్​ జిల్లాలోని నెల్లికుదురు మండలంలో టీఆర్​ఎస్​ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ఇండిపెండెంట్​ మద్దతు కీలకంగా మారింది. మెదక్ జిల్లాలో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇక్కడి నర్సాపూర్ మండలం లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​కు చెరి సగం బలముంది. చేగుంట మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలుంటే ఇండిపెండెంట్స్​ తొమ్మిది చోట్ల గెలిచారు. దీంతో నాలుగు సీట్లు గెలిచిన టీఆర్​ఎస్​ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తూప్రాన్, వెల్దుర్తి మండలాల్లో ఇండిపెండెంట్లు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీకి ఎంపీపీ పీఠం దక్కనుంది.

మంత్రి జగదీశ్​ రెడ్డి సొంత మండలం నాగారం(సూర్యాపేట జిల్లా)లో కాంగ్రెస్​, టీఆర్​ఎస్​కు చెరి సమానమైన సీట్లు వచ్చాయి. దీంతో అక్కడ పోటీ నెక్​ టు నెక్​ అన్నట్లుగా మారింది. నల్గొండ జిల్లా నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, చిట్యాల మండలాల్లో  టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కీలకం కానున్నారు. తిప్పర్తి మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సమాన మైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రెబల్ అభ్యర్థి ఎవరి వైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థి ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. మోత్కూరు, రాజాపేట, తుర్కపల్లి, ఆత్మకూర్​(ఎం), రామన్నపేట మండలాల్లో రెండు పార్టీలకు సరిపడే మెజారిటీ రాలేదు.

మహబూబ్​నగర్ జిల్లా​ చిన్న చింతకుంట మండలంలో టీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. వనపర్తి జిల్లాలో రేవల్లి మండలంలో ఇండిపెండెంట్​ మద్దతిచ్చిన వారు ఎంపీపీగా ఎన్నికవనున్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఉప్పునుంతల, లింగాల మండలాల్లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్ మధ్య సంఖ్యాబలం చెరిసమానంగా ఉంది. కొల్లాపూర్​, పెంట్లవెల్లి, కోడేరు మండలాల్లో ఇండిపెండెంట్లు కీలకం. ధన్వాడ మండలం టీఆర్​ఎస్​, బీజేపీకి చెరిసగం సీట్లు దక్కాయి. కానీ టీఆర్​ఎస్​ రెబల్​ ముగ్గురు గెలిచారు.

మేడ్చల్​ జిల్లాలో మూడు చింతలపల్లి మండలం బీసీ మహిళకు రిజర్వయింది. కాంగ్రెస్​ ఎక్కువ స్థానాలు గెలిచినా వారిలో బీసీ మహిళ లేకపోవటంతో ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్​, కొందుర్గు, యాచారం, నందిగామ, చేవెళ్ల, ఫారుఖ్​నగర్​, మాడ్గుల, కొత్తూరు, మంచాల మండలాల్లో ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కొత్తగూడెంలో అన్నపరెడ్డిపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్​ మండలాల్లో స్పష్టమైన ఆధిక్యత లేకపోవటంతో ఎంపీపీ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది.