చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

చట్టసభల్లో బీసీలకు 50 శాతం  రిజర్వేషన్లు కల్పించాలి
  • రాజ్యాంగ హక్కులు అందని ద్రాక్షగానే మిగిలాయి
  • బీసీల మేధో సదస్సు’ లో పార్లమెంట్ సభ్యులు

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ బీసీలకు రాజ్యాంగ హక్కులు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ/తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్​లో  ‘బీసీల మేధో సదస్సు’ జరిగింది. ఏపీ బీసీ సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మారేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సదస్సులో రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, పాక సత్యనారాయణ, బీద మస్తాన్ రావు, నాగరాజు, అప్పలనాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. ఓబీసీల డిమాండ్ల సాధనకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓబీసీలపై దృష్టి సారించిందని,  
ప్రధాని మోదీ తోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ లో10 లక్షల మందితో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా బీసీలకు గర్జన నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ మాదిరిగానే... బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ చట్టం తీసుకురావాలని ఎంపీ బీద మస్తాన్ రావు డిమాండ్ చేశారు.

బీసీ బిల్లుకు పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ మద్దతు తెలిపాలని మరో ఎంపీ నాగరాజు కోరారు. ఎంపీ అప్పల నాయుడు మాట్లాడుతూ... బీసీలకు న్యాయం చేయడం నూటికి నూరు శాతం ప్రధాని మోదీతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో చట్టసభలలో బీసీలకు సరైన న్యాయం జరగాలంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదం పొందాలని ఎన్. మారేశ్ అన్నారు. ఈ దిశగా త్వరితగతిన దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు.