మండల, జిల్లా పరిషత్​లకు ఫండ్స్ పెంచాలని ఎంపీటీసీ, జడ్పీటీసీల డిమాండ్

మండల, జిల్లా పరిషత్​లకు ఫండ్స్ పెంచాలని ఎంపీటీసీ, జడ్పీటీసీల డిమాండ్

రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్​లు నామ్​కే వాస్తేగా మారిపోతున్నాయి. అరకొర నిధులతో పనులు చేయలేకపోతున్నామని, సర్కారు పట్టించుకోవడం లేదని ఎంపీటీసీలు,  జడ్పీటీసీలు వాపోతున్నారు. తాజాగా కేంద్రం నుంచి రిలీజైన ఫండ్స్​ను లోకల్ ​బాడీలకు కేటాయించడంలో రాష్ట్ర సర్కారు తీరును తప్పుపడుతున్నా రు. కేంద్రం ఇటీవల 15వ ఫైనాన్స్ కమిషన్  కింద మన రాష్ట్రానికి రూ.1,847 కోట్లు విడుదల చేసింది. ఇందులో 10 శాతం మండల పరిషత్​లకు, 5 శాతం జెడ్పీలకు, మిగతా 85 శాతాన్ని గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఎంపీటీసీలు,  జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకపోతే డెవలప్ మెంట్ ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమైనా అదనంగా నిధులివ్వాలని కోరుతున్నారు. దాంతోపాటు 73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్న 29 అధికారాలను జెడ్పీలకు, ఎంపీపీలకు అప్పగించాలని డిమాండ్​ చేస్తున్నారు.

2015 నాటి నుంచి..

రాష్ట్రంలో 535 మండల పరిషత్ లు, 32 జిల్లా పరిషత్​లు ఉండగా.. 5,857 మంది ఎంపీటీసీలు, 535 మంది  జడ్పీటీసీలు ఉన్నారు. 2010 నుంచి 2015 వరకు అమలైన 13వ ఫైనాన్స్​ కమిషన్​ ఫండ్స్​లో 70 శాతం నిధులు జెడ్పీలకు, 20 శాతం నిధులు ఎంపీపీలకు వచ్చేవి. మిగతా 10 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు అందేవి. 14వ ఫైనాన్స్ కమిషన్  టైం (2015–2020)లో అంతా రివర్స్ అయ్యింది. మొత్తం వంద శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఫైనాన్స్​కమిషన్ టైం మొదలైంది. దీనిలో రాష్ట్ర సర్కారు పంచాయతీలకు 85 శాతం ఇచ్చి.. ఎంపీపీలకు 10 శాతం, జెడ్పీలకు 5 శాతమే కేటాయించింది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా రూ.1,847 కోట్లు

15వ ఫైనాన్స్ ​కమిషన్ ఏటా రూ.1,847 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నిధుల్లో గ్రామ పంచాయతీలకు రూ.1,569 కోట్లు, జెడ్పీలకు రూ.92 కోట్లు, ఎంపీపీలకు రూ.184 కోట్లు చొప్పున అందనున్నాయి.

కేంద్ర నిధులు..కేసీఆర్​ ప్రచారం

‘పంచాయతీ, మండల, జిల్లా పరిషత్​లలో వేటికి ఎంత శాతం నిధులివ్వాలో సిఫారసు చేయాలని కేంద్రం కోరితే.. వరుసగా 85, 10, 5 శాతం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తుంటే.. తానే ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రచారం చేసుకుంటున్నారు’

-చింపుల శైలజ, ఎంపీటీసీ, దేవుని ఎర్రవళ్లి గ్రామం, చేవెళ్ల మండలం