న్యూఢిల్లీ: టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఇండియన్‌గా నిలిచిన కరుణ్ నాయర్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవడం హృదయ విదారకమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అతనిపై కనికరం చూపించలేకపోయామన్నాడు. 2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఆ తర్వాత మూడు టెస్టులే ఆడి జట్టుకు దూరమయ్యాడు. ట్రిపుల్ సెంచరీ తర్వాత నాలుగు ఇన్నింగ్స్‌ల అనంతరం సెలెక్టర్లు అతనిపై వేటు వేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఓ వెబ్‌సైట్‌తో ఇంటరాక్షన్ సెషన్‌లో ఎమ్మెస్కే దీనిపై స్పందించాడు. చీఫ్ సెలెక్టర్‌గా తన పదవీకాలం సంతృప్తికరంగానే సాగిందన్నాడు. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం తాను పశ్చాత్తాప పడుతున్నానని, అందులో మొదటిది కరుణ్ నాయర్ అంశం అన్నాడు. ‘ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా మేం అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేకపోయాం. నాయర్ కమ్‌బ్యాక్ చేసేందుకు చాన్స్‌లు ఇవ్వాల్సింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలెక్ట్ చేసినా అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ అనేది చాలా అరుదైన విషయం. కానీ, అలాంటి ఓ ప్లేయర్‌కు మరో చాన్స్ ఇవ్వలేకపోవడం అతనికే కాదు మాకు కూడా గుండె పగిలే విషయం’ అని ఎమ్మెస్కే చెప్పాడు.
లాస్ట్ ఇయర్ జరిగిన వన్డే వరల్డ్ కప్‌కు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడం కూడా బాధాకరమని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. చివరి క్షణం వరకూ రేసులోనే ఉన్న అంబటికి చాన్స్ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. ఈ విషయంలో తన నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బాధపడాలని అభిప్రాయపడ్డాడు. అలాగే, ఇండియా టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను లిమిటెడ్ ఓవర్ల నుంచి డ్రాప్ చేయడం పట్ల కూడా రిగ్రెట్ అవుతున్నానని ఎమ్మెస్కే చెప్పాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరినీ పక్కనపెట్టి కుల్దీప్, చహల్‌ను తీసుకొచ్చాం. ఈ నిర్ణయం వల్ల జట్టుకు మంచి జరిగినా.. అప్పటికే టెస్టుల్లో నంబర్ 1,2 ర్యాంకుల్లో ఉన్న అశ్విన్, జడేజాను వన్డే టీమ్‌ను తప్పించామన్న విషయం మరిచిపోకూడదు’ అని అన్నాడు. ధోనీ ఈ ఐపీఎల్‌లో ఆడాలని అందరిలాగే తాను కూడా కోరుకున్నానని చెప్పాడు. విరామం తర్వాత గ్రౌండ్‌లో మహీ మునుపటి మెరుపులు చూడాలని అనుకున్నామన్నాడు. ఇప్పుడు లోకేశ్ రాహుల్ కూడా కీపర్‌గా బాగా రాణిస్తుండడంతో టీమిండియాలో రీఎంట్రీ ధోనీకి సవాల్‌గా మారిందని అభిప్రాయపడ్డాడు.

