
న్యూఢిల్లీ: ఒకప్పుడు పాప్ మ్యూజిక్, సరికొత్త పాటలకు కేరాఫ్అడ్రస్గా నిలిచిన ఎమ్‌టీవీ చానెల్ గొంతు మూగబోతోంది. కొన్ని మ్యూజిక్ చానెళ్లను మూసివేయనున్నట్లు పారామౌంట్ గ్లోబల్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఎమ్‌టీవీ 80స్, ఎమ్‌టీవీ మ్యూజిక్, క్లబ్ ఎమ్‌టీవీ, ఎమ్‌టీవీ 90స్, ఎమ్‌టీవీ లైవ్ మూతబడతాయి. ఎమ్‌టీవీ హెచ్డీ మాత్రం కొనసాగుతుంది.
ఈ చానెల్ రియాలిటీ టీవీ షోలను ప్రసారం చేస్తుంది. ఎమ్‌టీవీ బ్రాండ్ మ్యూజిక్ వీడియోల నుంచి రియాలిటీ షోల వైపు పూర్తిగా మారుతోంది. యూట్యూబ్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ వంటి ప్లాట్‌ఫారాల కారణంగా ఎమ్‌టీవీ చానెల్స్‌కు ఆదరణ తగ్గింది.
కొన్ని నెలల క్రితం పారామౌంట్ గ్లోబల్, స్కైడాన్స్ మీడియాతో విలీనం అయిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ఎమ్‌టీవీ ప్రకటనపై సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది. 'ఎక్స్' వినియోగదారులు ఎం టీవీతో తమ అనుభవాన్ని గుర్తుతెచ్చుకున్నారు. మ్యూజిక్ వీడియోలను నిలిపివేసినప్పుడే ఎమ్‌టీవీ మరణించిందని కొందరు రాశారు.