ముంబైలో భారీ వర్షాలు

ముంబైలో భారీ వర్షాలు
  • నీట మునిగిన అంధేరీ సబ్​వే
  • మలాడ్​లో చెట్టు విరిగి పడడంతో ఒకరు మృతి
  • ముంబై కోస్టల్ ఏరియాలకు భారీ వర్ష సూచన

ముంబై: ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎప్పుడూ బిజీగా ఉండే అంధేరీ సబ్​వే నీట మునిగిపోయింది. మలాడ్​లో చెట్టు పడి ఒకతను చనిపోయాడని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వే రూట్స్​లో లోకల్ ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. అంధేరీ సబ్​వేలో ఒకటిన్నర నుంచి 2 అడుగుల మేర నీరు చేరడంతో ట్రాఫిక్​ను ఎస్​వీ రోడ్​కు మళ్లించామని ముంబై ట్రాఫిక్  పోలీసులు తెలిపారు. దైసర్ ఈస్ట్​లోని కేత్కిపడాలో బీఎంసీ నడిపించే బృహన్​ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్​పోర్ట్ (బెస్ట్) బస్సులను మూడు చోట్ల డైవర్ట్ చేశారు. మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. 26 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. 15 చోట్ల షార్ట్ సర్క్యూట్ సంభవించాయి. ఐదు చోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ముంబైని ఇంకా వర్షాలు ముంచెత్తుతాయని ఐఎండీ ప్రకటించింది.  కోస్టల్ ఏరియాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మలాడ్​లో ఒకరు మృతి

మలాడ్​లోని మామ్లెదర్వాడి జంక్షన్​లో చెట్టు పడటంతో కౌషల్ దోషి (38)తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిని శతాబ్ది హాస్పిటల్​కు తరలించారు. అయితే అప్పటికే కౌషల్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సౌత్ ముంబైలో 1.24 సెంటీ మీటర్లు, ఈస్ట్రన్ ముంబైలో 4.24 సెంటీ మీటర్లు, వెస్ట్రన్ ముంబైలో 4.04 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఠానేలోని మహగిరి కోలివాడా ఏరియాలో ఇల్లు కూలిపోవడంతో 36 ఏండ్ల మహిళకు గాయాలయ్యాయి.

గోవాకు ఎల్లో అలర్ట్

గోవాలో మంగళవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పనాజీలోని పలు ప్రాంతాల్లో, 18వ జూన్ రోడ్, మాలా ఏరియాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఐంఎడీ కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని చోట్ల గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. జులై 1 వరకు దక్షిణ మహారాష్ట్ర – గోవా తీరం వెంట గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏరియాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ప్రకటించింది.