మల్లయుద్ధ పోటీ విజేతలకు రూ.30 లక్షలు

మల్లయుద్ధ పోటీ  విజేతలకు రూ.30 లక్షలు

హైదరాబాద్‭లో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ముఖేశ్‌ గౌడ్‌ స్మారక 'మల్లయుద్ధ' రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్‌గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు. మహిళల ఓపెన్‌ విభాగంలో రోహిణి సత్య శివాని పసిడి పతకం సాధించగా.. నేహా, రుహినా భాను రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బాలకేసరి విభాగంలో షేక్‌ అజీం బంగారు పతకం గెల్చుకోగా.. పర్వేజ్‌, పవన్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో భగీరత్‌ సింగ్‌ (38 కేజీలు), రవి భారత్‌ (42 కేజీలు), కె.ఎస్‌ కిషన్‌ (48 కేజీలు), మహ్మద్‌ అబ్దుల్‌ (52 కేజీలు), లవకుశ గౌడ్‌ (53 కేజీలు), డి. వినోద్‌ (57 కేజీలు), అరవింద్‌ కుమార్‌ (61 కేజీలు), సయ్యద్‌ అబ్దుల్లా (65 కేజీలు), మహేంద్ర కుమార్‌ (70 కేజీలు)లు తమ కేటగిరిల్లో బంగారు పతకాలు సాధించారు. 

ప్రతి విభాగంలో బంగారు పతకం సాధించిన రెజ్లర్‌కు రూ.1 లక్ష, రజత పతకానికి రూ.50 వేలు, కాంస్య పతకానికి రూ.25 వేల నగదు బహుమతులు అందజేశారు. మహిళల ఓపెన్‌ విభాగం ఫైనల్స్‌, బహుమతుల ప్రధానోత్సవానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రేష్ఠ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, బీజేపీ నాయకుడు విక్రమ్‌ గౌడ్‌తో కలిసి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ముఖేశ్‌ గౌడ్‌ స్మారకార్థం భారీ స్థాయిలో రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించిన.. విక్ర్రమ్‌ గౌడ్‌ను ఈటల రాజేందర్‌ అభినందించారు. మల్లయుద్ధ చాంపియన్‌షిప్‌ పోటీల్లో తలపడిన 700 మంది రెజ్లర్ల నుంచి.. ప్రతి విభాగంలో ఓ ఉత్తమ రెజ్లర్‌ను ఎంపిక చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనునన్నారు. రూ.5 లక్షలను ఉపకార వేతనాల రూపంలో ఏడాది పాటు ఇవ్వనున్నట్టు విక్రమ్‌ గౌడ్‌ ప్రకటించారు.