సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలనుకుంటున్న హైదరాబాద్ నగరవాసులకు ఒక ముఖ్యమైన సమాచారం. అంబర్‌పేట పోలీస్ గ్రౌండ్స్‌లో మీకోసం ఒక మంచి అవకాశం ఎదురుచూస్తోంది. హైదరాబాద్ సిటీ పోలీసులు త్వరలోనే భారీ స్థాయిలో వాహనాల వేలాన్ని నిర్వహించబోతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పడి ఉన్న ఎవ్వరూ క్లెయిమ్ చేయని 1,130 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఇందులో టూవీలర్ల, ఆటోలు, కార్లు కూడా ఉన్నాయి.
ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ వాహనాలను వేలం వేయడానికి ముందు పోలీసులు అసలైన యజమానులకు చివరి అవకాశం కల్పించారు. ఈ వాహనాలపై ఎవరికైనా హక్కులు ఉన్నా లేదా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా వెంటనే స్పందించాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు బంజారాహిల్స్‌లోని 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్'లోని పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ప్రకటన వెలువడిన 6 నెలల లోపు సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే తమ వాహనాన్ని క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.
ఒకవేళ నిర్ణీత గడువులోగా ఎవరూ ముందుకు రాకపోతే.. వాహనాలన్నీ ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడి బహిరంగ వేలంలోకి వెళ్తాయి. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, వాహనాల కండిషన్, మోడళ్లను అంబర్‌పేట పోలీస్ హాస్పిటల్ వెనుక ఉన్న 'SAR CPL' పోలీస్ గ్రౌండ్స్‌లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న వేలం టీమ్ కార్యాలయం వద్ద వాహనాల లిస్ట్ అందుబాటులో ఉంటుంది. పాత వాహనాల కోసం ఎదురుచూసే వారికి, మెకానిక్ షాపుల వారికి, స్క్రాప్ వ్యాపారులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.
