పోస్టల్ డిపార్ట్మెంట్ తన సేవింగ్ స్కీమ్స్ రూల్స్ విషయంలో 2026 నుంచి భారీ మార్పులు వచ్చాయి. సామాన్యులకు అత్యంత చేరువలో ఉండే పోస్టాఫీసు వ్యవస్థను మరింత పారదర్శకంగా, బ్యాంకింగ్, ఆదాయపు పన్ను వ్యవస్థతో అనుసంధానించేలా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై పోస్టాఫీసులో అకౌంట్ తెరవాలన్నా.. డబ్బులు జమ చేయాలన్నా, విత్‌డ్రా చేయాలన్నా PAN కార్డు తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ సేవింగ్స్ స్కీమ్స్‌లో జవాబుదారీతనాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని రూల్స్ 159, 160, 161, 211, 237 కింద ఈ మార్పులను ప్రవేశపెట్టారు. ఇది కేవలం చిన్న మార్పు మాత్రమే కాదు.. పోస్టాఫీసు లావాదేవీలను పన్ను రికార్డులతో నేరుగా అనుసంధానించే భారీ సంస్కరణ. పోస్టల్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, టైమ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇకపై పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే, ప్రభుత్వం గతంలో ఉన్న 'ఫారమ్ 60' స్థానంలో కొత్తగా 'ఫారమ్ 97'ని ప్రవేశపెట్టింది. ఈ ఫారమ్ ద్వారా గుర్తింపు కార్డులు, చిరునామా, లావాదేవీల వివరాలను సమర్పించి ట్రాన్సాక్షన్స్ కొనసాగించవచ్చు.
TDS మినహాయింపు ప్రక్రియలో కూడా ప్రభుత్వం భారీ మార్పు చేసింది. పన్ను పరిధిలోకి రాని వారు టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండేందుకు ఇప్పటివరకు సమర్పిస్తున్న ఫారమ్ 15G, ఫారమ్ 15Hలను విలీనం చేసి, కొత్తగా ఫారమ్ 121ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఫారమ్‌ను ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ రికార్డులను అధికారులు ఏకంగా 7 ఏళ్ల పాటు భద్రపరుస్తారు. దీనివల్ల పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట పడటమే కాకుండా పొదుపు పథకాలపై నిఘా మరింత పెరుగుతుంది.
ప్రస్తుతం ఈ మార్పులు అమల్లోకి వచ్చినప్పటికీ, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చిన్న వెసులుబాటు కల్పించింది. డిజిటల్ వ్యవస్థలు పూర్తిగా అప్‌గ్రేడ్ అయ్యే వరకు పాత ఫారమ్‌లను తాత్కాలికంగా స్వీకరించాలని పోస్టాఫీసులను ఆదేశించింది. ఈ మార్పుల వల్ల పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్ మరింత సురక్షితంగా, బ్యాంకింగ్ తరహాలో పారదర్శకంగా మారుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సామాన్య ప్రజలు ఈ కొత్త రూల్స్ పై అవగాహన పెంచుకుని తమ పొదుపు ప్రయాణాన్ని కొనసాగించడం ఇకపై అత్యవసరం.
