తమిళనాడులో హైడ్రామా.. గవర్నర్ ఇంటి మీదకు విజయ్ అభిమానులు !

తమిళనాడులో హైడ్రామా.. గవర్నర్ ఇంటి మీదకు విజయ్ అభిమానులు !

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే మద్దతుదారులు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ తో గవర్నర్ ఇంటి ముట్టడికి యత్నించారు. గవర్నర్ ఇంటి ముందు విజయ్కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయ్ అభిమానులు వెల్లువలా తరలివెళ్లారు.

ఇక.. గవర్నర్ తీరును నిరసిస్తూ తమిళనాడు కాంగ్రెస్ శుక్రవారం ధర్నాకు పిలుపునిచ్చింది. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడు గవర్నర్ను ఇప్పటికే రెండు సార్లు కలిసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

దీంతో.. గవర్నర్ 118 ఎమ్మెల్యేల సంతకాలతో తన దగ్గరకు రావాలని విజయ్కు స్పష్టం చేశారు. ఈలోపు మరే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనని టీవీకే అధినేతకు గవర్నర్ హామీ ఇచ్చారు. మెజారిటీకి కేవలం కొద్ది దూరంలోనే ఉండటంతో.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీవీకే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం కల్లా 50 మందికి పైగా ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఒక ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్‌‌కు తరలించారు. అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. 

కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో ఉన్న విజయ్‌‌కి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించింది. అయితే, కాంగ్రెస్‌‌తో పాటు ఇంకా ఏయే పార్టీలు, స్వతంత్రులు విజయ్‌‌కు మద్దతు ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2 స్థానాల్లో విజయం సాధించిన విదుతలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) మద్దతును విజయ్ కోరారు.