యూట్యూబ్ లో చూసి వంటలు.. ఉమ్మెత్తెపువ్వుతో కూర చేసిన మహిళ..

యూట్యూబ్ లో చూసి వంటలు.. ఉమ్మెత్తెపువ్వుతో కూర చేసిన మహిళ..
  • వీడియోలు, రీల్స్ చూసి రకరకాల ప్రయోగాలు 
  • ఉమ్మెత్త పువ్వు, ఆకులతో కూర చేసిన మహిళ 
  • అది తిని కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:సోషల్ మీడియాలో వచ్చే వెరైటీ వంటల వీడియోలు, రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్నాయి . తాజాగా ఓ మహిళ యూట్యూబ్​లో ఉమ్మెత్త పువ్వుతో కూర వీడియో చూసి.. వెరైటీగా ఉందని వండి తన ఇంట్లోవాళ్లందరికి పెట్టింది. అది తిన్న ఆ ఫ్యామిలీ విష ప్రభావానికి లోనై ఆస్పత్రి పాలైంది. చావు అంచుల వరకు వెళ్లిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. 

ఏపీలోని కాకినాడ జిల్లా ఎర్రంపాలెకు చెందిన గంగాభవానీ, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి హైదరాబాద్‌‌లో ఉంటున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా ఇటీవల స్వగ్రామం వెళ్లారు. ‘ఉమ్మెత్త పువ్వు, ఆకులు సైతం ఆకుకూరల మాదిరిగానే పోషకాలు ఇస్తుందని.. వాటితో వంట చేసిన వీడియోను గంగా భవానీ తల్లి వీరలక్ష్మి ఇన్‌‌స్టా‌‌గ్రామ్‌‌లో చూసింది. వెంటనే ఉమ్మెత్త పువ్వు, ఆకులతో పప్పు కలిపి సోమవారం కూర వండింది. 

ఆ వంట తిన్న వీరబ్బు, గంగభవాని, వీరలక్ష్మితో పాటు మరో బంధువు జయలక్ష్మి వికారం, వాంతులు, తలనొప్పి లక్షణాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే వారిని దవాఖానకు తరలించడంతో చికిత్స పొందుతున్నారు.

ఉమ్మెత్త పువ్వు విషంతో సమానం

ఉమ్మెత్త మొక్కలో ఉండే ఆల్కలాయిడ్లు (అట్రోపిన్, స్కోపోలమైన్ వంటి రసాయనాలు) మన శరీరానికి విషంతో సమానం. దాన్ని తింటే మన నాడీవ్యవస్థపై ప్రభావం చూపి గుండె వేగం పెరిగి ప్రాణాపాయం కలిగించే స్థితికి చేరుస్తాయి. అయితే ఈ మొక్కకు ప్రత్యేకమైన విరుగుడు అనేది లేదు. ఆదాయం కోసం చాలా మంది ఏ వీడియో పడితే ఆ వీడియో చేసి యూట్యూబ్ లో వదులుతుంటారు. 

లైక్స్, వ్యూస్​కోసం అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అవన్నీ నిజమా కాదా.. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. వాటి గురించి తెలియకపోతే పెద్దవారిని అడగాలి. కొన్ని మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికీ, వాటిని సరైన విధంగా వాడడంపై అవగాహన అవసరం. ఉమ్మెత్త, గన్నేరు, జిల్లేడు, గురువింద గింజలు విషంతో సమానం. 

ఉమ్మెత్త పువ్వు, ఆకు, గింజలు అన్ని విషపూరితం కాగా.. గన్నేరు పూలు, ఆకులు కూడా అంతే. జిల్లేడు ఆకులు, వాటి నుంచి కారే పాలు కూడా ప్రమాదమే. గురివింద గింజలు ఎరుపు-నలుపు గింజలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.. కానీ ఇవి అత్యంత విషపూరితమైనవి. కనుక వంట చేసుకునే సమయంలో వివిధ రకాల కూరగాయలు, మొక్కలు కలిపి వండటం.. కలిపి తినడం లాంటివి చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ముప్పు తప్పదు.