V6 News

స్టేట్‍ టాప్‍ ‘ములుగు’...టాప్‍ 10లో ఓరుగల్లు నుంచి 3 జిల్లాలు

స్టేట్‍ టాప్‍ ‘ములుగు’...టాప్‍ 10లో ఓరుగల్లు నుంచి 3 జిల్లాలు
  •     ఫలితాల పర్సంటేజీలో అమ్మాయిలదే హవా
  •     ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్‍ లాస్ట్​  
  •     గతేడాది మహబూబాబాద్‍ జిల్లా టాప్‍ 
  •     ములుగు జిల్లా ఫలితాలపై మంత్రి సీతక్క హర్షం

వరంగల్‍/ ములుగు, వెలుగు:  బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా స్టూడెంట్లు ప్రతిభ చూపి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ములుగు 99.30 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 84 ప్రభుత్వ పాఠశాలలకు గానూ 63 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

గతేడాది టాప్‍ వన్‍ స్థానంలో నిలిచిన మహబూబాబాద్‍ ఈసారి 98.81 శాతంతో రాష్ట్రంలో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. హనుమకొండ జిల్లా 98.56 శాతంతో 9వ స్థానం, జయశంకర్‍ భూపాలపల్లి 98.36 శాతంతో 11వ స్థానం, జనగామ 97.66 శాతంతో 17వ స్థానంలో నిలవగా, వరంగల్‍ జిల్లా 95.25 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 23వ స్థానంతో నిలిచింది. ఓరుగల్లులో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఫలితాల్లో ముందంజలో  నిలిచారు. 

వెనుకబడిన ‘భద్రాద్రికొత్తగూడెం’ 

భద్రాద్రికొత్తగూడెం : టెన్త్​ రిజల్ట్స్​లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వెనుకబడింది. జిల్లాలో 12,703 మంది స్టూడెంట్స్​ పరీక్షలు రాయగా, 11,506 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.58శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 32వస్థానంలో నిలిచింది. జిల్లాలోని 302 స్కూల్స్ నుంచి టెన్త్ ఎగ్జామ్స్​కు అటెండ్ కాగా, 68 స్కూల్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

టాప్‍ వన్‍ రావడం హ్యాపీ..

పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా 99.30 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడంపై పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ధనసరి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అద్భుత ఫలితాలు సాధించిన స్టూడెంట్లు, వారికి మార్గనిర్ధేశం చేసిన టీచర్లు, జిల్లా అంతటా పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన అప్పటి కలెక్టర్‍ దివాకర్, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా టెన్త్​ స్టూడెంట్స్​ 95.15 ఉత్తీర్ణత సాధించడం సంతోషధాయమన్నారు.

- పంచాయతీరాజ్‍శాఖ మంత్రి సీతక్క

పదిలో ఫలితాల్లో అబ్బాయిలు టాప్

ఖమ్మం టౌన్ : టెన్త్ ఫలితాల్లో అబ్బాయిలు టాప్ గా నిలిచారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 16958 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వీరిలో అబ్బాయిలు 8201, అమ్మాయిలు 7930 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 95.12 గా నమోదవగా, జిల్లా రాష్ట్ర స్థాయిలో 25 స్థానంలో నిలిచింది.

టెన్త్ ఫలితాల్లో మార్మోగిన‘మాస్టర్ జీ’

హనుమకొండ సిటీ, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో మాస్టర్ జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. 600 మార్కులకు మాస్టర్ జీ స్కూల్ కు చెందిన కుంభ శ్రేష్టి నిధి 580, సయ్యద్ బుష్రా లోరీన్ 579, దీక్షా గంగోత్రి 575, ఉమ్మె హబీబా 574, చిలగాని లాస్య 573, ఉప్పు గీతిక 572, సోమ హన్సిక 567, జీ.శ్రీశాంత్ రెడ్డి 567, శ్రీలయ 566 మార్కులు సాధించారు. పరీక్షలకు హాజరైన 146 మంది విద్యార్థుల్లో 29 మంది 550 పైగా, 87 మంది  500 పైచిలుకు మార్కులు పొంది ప్రతిభ చాటారు. మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ విజయం పాఠశాల నాణ్యమైన విద్యాబోధనకు నిదర్శనమన్నారు. 

ఉమ్మడి వరంగల్​లోని జిల్లాల వారీగా పాసైన విద్యార్థుల సంఖ్య 

                                           హాజరైన                              ఉత్తీర్ణత పొందిన
జిల్లా                        బాలురు    బాలికలు    మొత్తం    బాలురు    బాలికలు    మొత్తం
ములుగు                 1697          1590            3287         1681          1583            3264
మహబూబాబాద్‍     4154         3998             8152         4089          3966            8055
హనుమకొండ         6310         5755             12065        6204         5687            11,891
భూపాలపల్లి           1750         1791              3541         1708          1775            3483
జనగామ                 3105         3338              6443         3013          3279            6292
వరంగల్‍                4924         4561              9485         4665           4369            9034