మూడో విజయంతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్‌‌‌‌

మూడో విజయంతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్‌‌‌‌
  •  మూడో విక్టరీతో టాప్ ప్లేస్‌‌‌‌కు
  •  రాణించిన బ్రంట్‌‌‌‌, కెర్‌‌‌‌‌‌‌‌
  •  ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి మరో ఓటమి

బెంగళూరు: ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో సత్తా చాటిన ముంబై ఇండియన్స్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌) మూడో సీజన్‌‌‌‌లో ముచ్చటగా మూడో విజయంతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌‌‌‌లో నిరాశ పరిచిన  ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లో ఓడింది. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 131/6 స్కోరు మాత్రమే చేసింది. 

ఎలైస్ పెర్రీ (38 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 44 నాటౌట్‌‌‌‌), జార్జియా వారెహమ్ (27) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. ముంబై బౌలర్లలో పూజా వస్త్రాకర్ (2/14), సివర్ బ్రంట్ (2/27) చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం అమేలియా కెర్ (24 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లతో 40 నాటౌట్‌‌‌‌) మెరుపులతో  ముంబై 15.1 ఓవర్లలోనే 133/3 స్కోరు చేసి గెలిచింది. యాస్తికా భాటియా (15 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు 31) కూడా సత్తా చాటింది.  కెర్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆదుకున్న పెర్రీ

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (9) మూడో ఓవర్లో ఇసీ వాంగ్ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను లాఫ్టెడ్‌‌‌‌ డ్రైవ్ ఆడబోయి సివర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చింది. మరో ఇన్‌‌‌‌ఫామ్ బ్యాటర్ సబ్బినేని మేఘన (11) ను ఐదో ఓవర్లో సివర్ బ్రంట్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేర్చగా.. సోఫీ డివైన్ (9)ను సైకా ఇషాక్‌‌‌‌ ఎల్బీగా ఔట్‌‌‌‌ చేయడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో బెంగళూరు 34/3తో  కష్టాల్లో పడింది. 

ఈ దశలో ఎలైస్ పెర్రీ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకుంది. కానీ, హిట్టర్ రిచా ఘోశ్ (7), సోఫీ మొలినుక్స్‌‌‌‌ (12)ను పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌  ఔట్ చేయడంతో  ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 71 రన్స్‌‌‌‌కే సగం వికెట్లు కోల్పోయింది.  ఈ టైమ్‌‌‌‌లో క్రీజులో కుదురుకున్న పెర్రీకి వారెహమ్ తోడైంది. ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో16 ఓవర్లలో స్కోరు వంద దాటింది. 19వ ఓవర్లో వారెహమ్‌‌‌‌ను ఔట్ చేసిన బ్రంట్ ఆరో వికెట్‌‌‌‌కు 52 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్ చేసింది. ఆఖరి బాల్‌‌‌‌కు వరకూ క్రీజులో ఉన్న పెర్రీ  స్కోరు 130 దాటించింది.

ముంబై ధనాధన్

చిన్న టార్గెట్‌‌‌‌ను ముంబై ఇండియన్స్ ఈజీగా ఛేజ్‌‌‌‌ చేసింది. ఓపెనర్లు యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్‌‌‌‌(26) తొలి ఓవర్‌‌‌‌ నుంచే  ఎదురుదాడి చేశారు.  మొలినుక్స్‌‌‌‌ వేసిన రెండో ఓవర్లో భాటియా 6,4తో విజృంభించింది. ఆపై రేణుక బౌలింగ్‌‌‌‌లో మాథ్యూస్ రెండు ఫోర్లు కొట్టగా.. భాటియా సిక్స్‌‌‌‌తో అలరించింది. సోఫీ డివైన్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన భాటియా మరో షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్ అయింది.  

వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన స్టాండిన్ కెప్టెన్ సివర్ బ్రంట్ (27) కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలోనే ముంబై 60/1తో నిలిచింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన వారెహమ్‌‌‌‌కు హేలీ సిక్స్‌‌‌‌తో వెల్‌‌‌‌కం చెప్పింది. తర్వాతి ఓవర్లో ఆమెను శ్రేయాంక పాటిల్ ఔట్‌‌‌‌ చేసింది. ఈ టైమ్‌‌‌‌లో బ్రంట్‌‌‌‌కు తోడైన  అమేలియా కెర్‌‌‌‌ సైతం వరుస షాట్లతో విరుచుకుపడింది. సిమ్రన్‌‌‌‌, శ్రేయాంక, శోభన్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టడంతో 12 ఓవర్లకే స్కోరు వంద దాటింది.  సివర్‌‌‌‌‌‌‌‌ ఔటైనా వారెహమ్‌‌‌‌  వేసిన16 ఓవర్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌ను బౌండ్రీకి పంపిన కెర్‌‌ మ్యాచ్‌‌‌‌ ముగించింది.

సంక్షిప్త స్కోర్లు
ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ: 20 ఓవర్లలో 131/6 (పెర్రీ 44 నాటౌట్, వారెహమ్ 27, వస్త్రాకర్ 2/14).
ముంబై: 15.1 ఓవర్లలో 133/3 (కెర్ 40 నాటౌట్‌‌‌‌,  శ్రేయాంక 1/15).