ముంబైకి చెందిన ఓ పెట్టుబడిదారుడు డాక్టర్ అనిరుద్ధ మల్పాణి, ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా(Zerodha)పై సంచలన ఆరోపణలు చేశారు. తన డీమ్యాట్ అకౌంట్లో ఉన్న రూ. 18 కోట్ల డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణుల మధ్య విత్‌డ్రా పరిమితులు, పెట్టుబడిదారులకు ఉండాల్సిన అవగాహన గురించి చర్చ మొదలైంది. దీనిపై జెరోధా సహ-వ్యవస్థాపకుడు నితిన్ కామత్ స్పందించి పరిస్థితిని వివరిస్తూ విత్‌డ్రా ప్రాసెస్ పూర్తయిందని తెలిపారు.
డాక్టర్ మల్పాణి జెరోధా అకౌంట్ స్క్రీన్‌షాట్ Xలో పోస్ట్ చేస్తూ మొత్తం అకౌంట్లో సుమారు రూ. 42.92 కోట్లు చూపిస్తుండగా, అందులో వాడుకున్న మార్జిన్ (ట్రేడింగ్‌లో లాక్ అయిన డబ్బు) సుమారు రూ. 24.46 కోట్లు.. రూ. 18.46 కోట్లు విత్‌డ్రా చేసుకోవడానికి ఉన్న బ్యాలెన్స్ గా చూపించింది. అయితే, ఒక రోజుకి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడానికి జెరోధా యాప్ అనుమతించట్లేదని ఇది పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు.
 నా సొంత డబ్బు నా అకౌంట్  నుంచి విత్ డ్రా చేసుకోవడానికి అనుమతించడం లేదు, డైలీ  విత్‌డ్రా లిమిట్  రూ. 5 కోట్లు అని చెబుతుంది. జెరోధా నా డబ్బును ఫ్రీగా వాడుకుంటున్నారు అంటూ నితిన్ కామత్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ స్క్రీన్‌షాట్‌లో యాప్ రోజుకు రూ. 5 కోట్లు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు  అని చూపిస్తుంది. 
 
ఈ పోస్ట్ ఇంటర్నెట్లో దుమారం లేపింది. కొందరు డాక్టర్ మల్పాణికి సపోర్ట్  చేస్తూ  పెట్టుబడిదారులపై కండిషన్స్  విధించడం సరికాదన్నారు. మరికొందరు మాత్రం బ్రోకరేజీ సంస్థని సమర్థించారు. మోసాలు జరగకుండా లేదా పొరపాటున పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండటానికి ఇలాంటి రూల్స్ చాలా సాధారణ భద్రతా చర్యలు అని అన్నారు. 
మరొక అతను అకౌంట్లో అన్ని కోట్లు ఎందుకు ఉంచుకోవాలి ? బ్యాంకులు, పేమెంట్ యాప్‌లకు కూడా డైలీ విత్‌డ్రా లిమిట్స్ ఉంటాయి. ఇది స్కామ్ కాదు అని కామెంట్ చేశారు. ఈ వివాదంపై పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేసుకోవాలంటే, కస్టమర్లు రిక్వెస్ట్ చేయవచ్చని జెరోధా స్పష్టం చేసింది. రూ. 5 కోట్ల విత్‌డ్రా పరిమితి అనేది సిస్టమ్ సెక్యూరిటీ కోసమే పెట్టామని, కస్టమర్లను కాపాడటానికి తీసుకున్న జాగ్రత్త అని వివరించారు.
పెద్ద మొత్తంలో విత్‌డ్రా అయినప్పుడు లేదా ఏదైనా పొరపాట్లు లేదా మోసాలు జరిగితే ఆ డబ్బును తిరిగి పొందడం కంపెనీకి అసాధ్యం అవుతుంది. అందుకే, రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విత్‌డ్రాల కోసం కస్టమర్లు రిక్వెస్ట్ చేయమని అడుగుతామని, ఇది సేఫ్ ట్రాన్సక్షన్ కోసం ఆర్థిక రంగంలో పాటించే సాధారణ పద్ధతి అని ఆయన చెప్పారు.
