బాధల నుంచి విముక్తి ఇచ్చా: తల్లిని చంపిన కొడుకు

బాధల నుంచి విముక్తి ఇచ్చా:  తల్లిని చంపిన కొడుకు

నవ మాసాలు కని పెంచిన తల్లిని దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు. హత్య చేసింది కాక, అమ్మకు అనారోగ్యం, నొప్పుల బాధల నుంచి విముక్తి కలిగించానని పోలీసుల ముందు చెప్పాడు. ఈ ఘోరం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.
ముంబైలోని తారాపూర్ లో ఉన్న బాబా అటామిక్ పవర్ స్టేషన్ కాలనీలో ఉంటున్న తల్లి చంద్రావతి (62)ని ఆదివారం నాడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు ఆమె చిన్న కొడుకు జయప్రకాశ్ ధోబీ (30). మృతురాలికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. చంద్రావతి తన భర్త, కూతురి కలిసి ఉంటోంది. కొడుకులిద్దరూ ముంబైలోని దత్తాత్రేయ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రతి ఆదివారం తల్లిని చూడడానికి వస్తుంటారు.

డిసెంబరు 29న వచ్చిన జయప్రకాశ్.. తన సోదరి, తండ్రి బయటికి వెళ్లిన సమయంలో ఇనుప రాడ్డుతో తలపై కొట్టి తల్లిని చంపేశాడు. పెద్ద కొడుకు అక్కడికి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న అమ్మ పక్కన జయప్రకాశ్ రాడ్డు పట్టుకుని కూర్చుని ఉన్నాడు. దీంతో అతడు తమ్ముడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే జయప్రకాశ్ మానసిక స్థితి సరిగా లేదని అతడి అన్న చెప్పాడు. అయితే పోలీసులు జయప్రకాశ్ ని ప్రశ్నించగా.. తల్లికి బీపీ, షుగర్, కంటి సమస్యలు, మోకాళ్ల నొప్పులు ఉన్నాయని, ఆమెకు ఆ నొప్పుల బాధ నుంచి విముక్తి కలిగించానని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించారు. అతడి మానసిక స్థితిపై డాక్టర్ల నివేదిక ఆధారంగా తగిన సెక్షన్ల ప్రకారం కేసు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.