- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్‌గా సాగిన క్యాంపెయిన్
- కరీంనగర్‌లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటనతో శ్రేణుల్లో జోష్
- బీజేపీకి ఊపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ విజయ సంకల్ప ర్యాలీ
- కార్పొరేషన్ దిక్కు చూడని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. వారం రోజులుగా డీజే పాట మోతలు, డప్పు చప్పుళ్లు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తిన పట్టణాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ప్రచార గడువు ముగియడం, ఎన్నికకు ఒక్క రోజే ఉండడంతో అభ్యర్థులు.. ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసే పనిలోపడ్డారు.
ఓటుకు రూ.1000 నుంచి రూ.5 వేలతోపాటు మద్యం బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఇంటింటికి పంపేందుకు కొందరు ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ చికెన్, మటన్ ఆర్డర్ చేశారు. కాగా ఈసారి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఇతర లీడర్లు ప్రచారానికి వచ్చారు. రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నిండింది.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ గా క్యాంపెయిన్
ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్‌గా అన్నట్లు క్యాంపెయిన్ సాగింది. సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్, జమ్మికుంట, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, చొప్పదండి, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తలపడుతుండగా.. కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు బీజేపీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పోటీ ఇస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడుస్తోంది. కరీంనగర్‌లో కొన్నిచోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల ఎంఐఎం అభ్యర్థులు పోటీ ఇస్తున్నారు.
అన్నీ తానైన బండి సంజయ్
బీజేపీ అభ్యర్థుల తరఫున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నీతానై ప్రచారం నిర్వహించారు. ఒకవైపు ప్రచారం, మరోవైపు పార్టీ కార్యక్రమాలు, ఇంకోవైపు పోల్ మేనేజ్ మెంట్ సహా అన్నీ పనులు ఒంటి చేత్తో నిర్వర్తించారు. హిందుత్వ నినాదాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారని ప్రత్యర్థి పార్టీలు భావించినప్పటికీ.. అందుకు భిన్నంగా పూర్తిగా అభివృద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు... కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తాను తెచ్చిన నిధులపై ప్రత్యేకంగా బుక్ లెట్ ముద్రించి పంచిపెట్టారు. ఆదివారం కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ నుంచి టవర్ సర్కిల్ వరకు నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీ కార్యకర్తల్లో జోష్ నింపింది.
కరీంనగర్‌ను లైట్ తీసుకున్న బీఆర్ఎస్
ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే బీఆర్ఎస్ మాత్రం లైట్ తీసుసుకున్నట్లు కనిపించింది. బీఆర్ఎస్ ప్రచార బాధ్యతల భారం మొత్తం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మోశారు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావు కరీంనగర్‌కు ప్రచారానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రచారం చేసినా తగినన్ని సీట్లు గెలిచే పరిస్థితి లేకనే రాలేదనే ప్రచారం జరుగుతోంది.
మంత్రి పొన్నం పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం
కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చివరి రెండు రోజులు కరీంనగర్‌లోని మెజార్టీ డివిజన్లలో ప్రచారం చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మంత్రి పొన్నంతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా ఉంది.
