- తేలనున్న 2,360 మంది అభ్యర్థుల భవితవ్యం
- రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
- క్యాంపులు సిద్ధం చేస్తున్న ప్రధాన పార్టీల లీడర్లు
కరీంనగర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, రాయికల్, ధర్మపురి, మెట్‌పల్లి, కోరుట్ల, పెద్దపల్లి, సుల్లానాబాద్, మంథని మున్సిపాలిటీల పరిధిలో కౌంటింగ్‌కు గురువారం ఏర్పాట్లు పూర్తి చేశారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆయా కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని 461 స్థానాలకు గానూ రామగుండం కార్పొరేషన్ లో 1వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో మిగతా 460 స్థానాల్లో 2,360 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో గెలవబోయే 460 మంది ఎవరనేది మధ్యాహ్నం వరకు తేలిపోనుంది.
కరీంనగర్ లో ఏర్పాట్లు పూర్తి..
కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్ల కౌంటింగ్ కోసం ఎస్ఆర్ఆర్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సీపీ గౌస్ ఆలం సమక్షంలో మాస్టర్ ట్రైనర్లు కౌంటింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్ సూపర్ వైజర్లు కలుపుకొని మొత్తం 300 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. 1000 ఓట్లకు ఒక రౌండ్ చొప్పున ఫలితాలను వెల్లడించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
హుజూరాబాద్ మున్సిపాలిటీలోని 30 వార్డుల కౌంటింగ్‌ను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో, జమ్మికుంటలోని 30 వార్డుల కౌంటింగ్ ను జమ్మికుంట డిగ్రీ కాలేజీలో చేపట్టబోతున్నారు. ఈ సెంటర్లలో 5 కౌంటింగ్ హాళ్లు, 30 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేసి 30 మంది సూపర్ వైజర్లు, 60 మంది అసిస్టెంట్ల చొప్పున నియమించారు. ఒక్క రౌండ్ లోనే రిజల్ట్ వెలువడనుంది. చొప్పదండి మున్సిపల్ వార్డుల కౌంటింగ్‌కు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల సినారె కళామందిరంలో మాక్ కౌంటింగ్ ప్రక్రియను శుక్రవారం చేపట్టారు.
జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి, వేములవాడలో మాక్ కౌంటింగ్ ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మహేశ్ బి.గీతేతో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ 8గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని వివరించారు.
రామగుండంలో తొలి ఫలితం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌దే గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గానూ 1వ డివిజన్ ఏకగ్రీవం కాగా, మిగిలిన 59 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ పర్మినెంట్, టెంపరరీ టౌన్‌షిప్‌తో కూడిన 24వ డివిజన్లో అతి తక్కువగా 1214 ఓట్లు పోలవ్వగా...దీని ఫలితం మొదటగా వెలవడనున్నది.
మొత్తంగా మూడు రౌండ్లలో అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయి. రామగుండం కమిషనరేట్ పరిధిలోని రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. పెద్దపల్లిలోని 36 వార్డులకు, మొత్తం ఆరు కౌంటింగ్ సెంటర్లు, ఆరు టేబుళ్ల తో లెక్కింపు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్.. గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్‌కు ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 50 వార్డులు ఉండగా, లెక్కింపునకు 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులకు 655 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధర్మపురి 15 వార్డులకు 52 మంది, జగిత్యాల 50 వార్డులకు 254 మంది, కోరుట్ల 33 వార్డులకు 150 మంది, మెట్‌పల్లి 26 వార్డులకు 150 మంది, రాయికల్ 12 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
