- నేడు మంత్రి ఉత్తమ్ వద్దకు జిల్లా కాంగ్రెస్ నేతలు
- బీజేపీలో సర్వేలతో అభ్యర్థుల ఎంపిక
- గెలిచే స్థానాల్లోనే మజ్లిస్ పోటీ
- ఉనికి కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే విజయం సాధించవచ్చన్న అంచనాతో ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. టికెట్ల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. నగర పాలక సంస్థ పరిధిలో 600లకు పైగా దరఖాస్తులు రాగా, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల నుంచి 400లకు పైగా అప్లికేషన్లు అందాయి.
అధిష్టానం ఆదేశాల మేరకు అప్లికేషన్ల గడువును బుధవారం వరకు పొడిగించే యోచనలో జిల్లా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రతి డివిజన్, వార్డు నుంచి ముగ్గురు పేర్లను బీజేపీ హైకమాండ్‌కు పంపడానికి సర్వే చేపట్టారు. గెలిచే సీట్లను అంచనా వేస్తూ మజ్లిస్ అభ్యర్థులను రెడీ చేస్తున్నది. బీఆర్ఎస్ మీటింగ్‌లతో కేడర్‌లో కదలిక తేవడానికి ప్రయత్నిస్తున్నది.
ఇన్‌చార్జ్ ఉత్తమ్ చెంతకు కాంగ్రెస్ నేతలు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే సూచనల నేపథ్యంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆశావహులు భారీగా దరఖాస్తులు సమర్పించారు. నగరంలోని 60 డివిజన్లు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లోని 86 వార్డుల్లో ప్రతి వార్డుకు పదికి మించి అప్లికేషన్లు వచ్చాయి. ప్రతి డివిజన్, వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను హైకమాండ్‌కు పంపనున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తో చర్చించేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు బుధవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
బీజేపీది అదే వ్యూహం ..
నగర పాలక సంస్థపై దృష్టి సారించిన బీజేపీ ఆశావహుల నుంచి 500లకు పైగా అప్లికేషన్లు స్వీకరించింది. ఇన్‌చార్జిలుగా వచ్చిన ప్రభాకర్, కాంతారావు ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రతి డివిజన్‌కు ముగ్గురు అభ్యర్థులను సర్వే ద్వారా ఎంపిక చేసి స్టేట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో ఎంపీ అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ఉన్నారు. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.
మజ్లిస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి..
గత ఎన్నికల్లో నగర పాలక సంస్థలోని 60 డివిజన్లలో 16 డివిజన్లు గెలిచిన మజ్లిస్ ఈసారి 20 డివిజన్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అధిష్టాన ఆమోదానికి పంపింది. బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో 16 స్థానాలను టార్గెట్‌గా పెట్టుకున్న మజ్లిస్, ఆర్మూర్, భీంగల్‌లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. పోటీ చేయని చోట్ల కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.
కేడర్‌ను కదిలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం..
మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తి తగ్గిన కేడర్‌ను చైతన్యపర్చేందుకు బీఆర్‌ఎస్ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం బోధన్‌లో, మంగళవారం నగరంలో పార్టీ సమావేశాలు నిర్వహించి కేడర్‌లో కదలిక తీసుకురావడానికి ప్రయత్నించారు.
