మున్సిపల్ ఎన్నికల్లో ఉపాధి.. ఒక్కొక్కరికి రూ.500..టీ, టిఫిన్, లంచ్ అరెంజ్

మున్సిపల్ ఎన్నికల్లో ఉపాధి.. ఒక్కొక్కరికి రూ.500..టీ, టిఫిన్, లంచ్ అరెంజ్
  • మున్సిపల్ ఎన్నికల్లో  అన్ని పార్టీల ప్రచారానికి వెళుతున్న ప్రజలు 
  • మహిళలకు రూ. 200 నుంచి రూ. 500
  • పురుషులకు రూ. 500 అంతకు పైగా
  • టీ, టిఫిన్​, ఇతరత్రా ఎక్స్ ట్రా
  • ప్రచారానికి వెళ్తున్న వారి ఇండ్లల్లో వేర్వేరు పార్టీల కండువాలు

యాదాద్రి, వెలుగు: మున్సిపాలిటీలో ఎన్నికలు చాలా మందికి ‘ఉపాధి’ కల్పిస్తోంది.  నామినేషన్ల సమయంలో తీసుకువచ్చినట్లే ప్రచారానికి కూడా మహిళలు, పురుషులను పిలిపించుకుంటున్నారు. ఏ పార్టీ ప్రచారానికి వెళ్లినా ఆ పార్టీ కండువా మెడలో వేసుకొని, జెండా చేతిలే పట్టుకొని  జై అంటూ నినాదాలు ఇస్తున్నారు . ప్రచారానికి వచ్చిన వారికి రోజు ‘కూలి’ ఇస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం అంటే ఆయా పార్టీల కార్యకర్తలే ప్రచారంలో పాల్గొనే వారు. ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్​ మారింది. ఎన్నికలు అంటేనే డబ్బుల వ్యవహారమే కన్పిస్తోంది. డబ్బు ఖర్చు పెట్టేవారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి అయినా తనకున్న ‘అంగబలం.. అర్థబలం’ ఉందని ప్రచారంలో ప్రదర్శించేందుకు ఆరాటపడుతున్నారు. 

ప్రచారానికి ‘జనం’

ప్రచారానికి మహిళలు వస్తే రూ. 200 నుంచి రూ.500 వరకూ ఇస్తున్నారు. పురుషులయితే రూ. 500కు పైగా ఇస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న వారికి కూలితో పాటు టీ, టిఫిన్​, లంచ్​అరెంజ్​ చేస్తున్నారు. పురుషులకైతే మూడింటితో పాటు వెహికల్​లో పెట్రోల్, లిక్కర్‌‌ కు అదనంగా డబ్బులిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీల్లోనే ఒక్కో పార్టీకి చెందిన వార్డు అభ్యర్థి పరిమితంగా ఖర్చు చేస్తేనే ప్రతి రోజు రూ. 50 వేల నుంచి రూ. లక్ష అవుతోంది.

అయితే కొందరు అభ్యర్థులు పరిమితి దాటి రోజుకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్​, బీఆర్‌‌ఎస్​ అభ్యర్థులు పోటీ పడి ఖర్చు చేస్తున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారిలో కొందరు మినహా చాలా మంది పరిమితంగా ఖర్చు చేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న వారి పేర్లు ముందుగా రాసుకొని, ప్రచారం ముగియగానే పేమెంట్​ చేస్తున్నారు. 

ఎన్నికల్లో కౌన్సిలర్​గా పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థి ప్రతి ఓటరును కలుస్తున్నారు. ప్రచారానికి వస్తున్న కూలీలు మాత్రం మెడలో పార్టీ కండువా, చేతిలో జెండా పట్టుకొని వెంట నడుస్తున్నారు. ఒక పార్టీ ప్రచారంలో పాల్గొన్న వారే..  మరో పార్టీ ప్రచారంలోనూ కన్పిస్తున్నారు.  దీంతో ప్రచారానికి వెళ్తున్న వారి ఇండ్లల్లో  రెండు మూడు పార్టీలకు చెందిన కండువాలు కన్పిస్తున్నాయి. 

పైసలు సరిగా ఇవ్వలేదని వాగ్వాదాలు

ప్రచారానికి వచ్చినప్పటికీ.. పైసలు సరిగా ఇవ్వలేదని పలు మున్సిపాలిటీల్లో గొడవలు జరుగుతున్నాయి. తమను ప్రచారానికి తీసుకొచ్చిన వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని ఒక వార్డులో బీఆర్ఎస్​ నిర్వహించిన ప్రచారానికి వంద మందికి పైగా మహిళలు వచ్చారు.

ప్రచారం ముగిసిన అనంతరం రూ. 200 ఇవ్వడంతో తమను తీసుకొచ్చిన వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. కొందరికి రూ. 500 ఇచ్చి మాకు.. రూ. 200 ఇస్తావా..? అంటూ గొడవకు దిగారు. ప్రచారానికి కొందరినీ మాత్రమే పిలుస్తూ.. మరికొందరిని పిలవక పోవడంపై మహిళలు భగ్గుమంటున్నారు. ప్రచారానికి తామూ వస్తామంటూ వెళ్తున్నారు.