- బరిలో 1632 మంది అభ్యర్థులు
- పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది, సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా
- ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- ఈ నెల 13 న కౌంటింగ్
నల్గొండ/యాదాద్రి, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలలోని 400 వార్డులలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 1737 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బంది మంగళవారం భారీ బందోబస్తు నడుమ ఆయా కేంద్రాలకు తరలించారు. నల్గొండ జిల్లాలో
నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, చిట్యాల,చండూరు, హాలియా మున్సిపాలిటీలలో 162వార్డులు ఉండగా 3,09,097 మంది ఓటర్లు ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో ఒక వార్డ్ ఏకగ్రీవం అయింది. మిగిలిన 161 వార్డులలో 712మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 475 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనుండగా 620 బాక్సులను సిద్ధం చేశారు. 70 మంది ఆర్వోలు, 68 మంది ఏఆర్వోలు, 475 మంది పీవోలు, ఏపీవోలు, 1425 మంది ఓపీవోలు కలిపి 2850 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 47 మంది జోనల్ ఆఫీసర్లు, 59 మంది రూట్ ఆఫీసర్లు, 8 ఎస్ఎస్టీ, 9 ఎఫ్ఎస్టీ, 7 ఎంసీసీ, వీఎస్టీ, వీవీటీ టీమ్స్ ఏర్పాటు చేశారు.
నల్గొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలలో జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది 5 ప్లాటూన్ల టీజీఎస్పీ పోలీస్ సిబ్బందిని నియమించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లను గుర్తించి, ఆయా పోలింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బలగాలు, 7 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 08 ఎస్ఎస్టీ టీంలు ఏర్పాటు చేశారు.
యాదాద్రి జిల్లాలో
యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 104 వార్డులున్నాయి. 1.32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చౌటుప్పల్‌లోని 17 వార్డు, యాదగిరిగుట్టలోని 10వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 102 వార్డుల్లో 353 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జిల్లాలో 212 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
వీటిలో 51 క్రిటికల్ పోలింగ్ సెంటర్లుగా గుర్తించారు. 449 పోలింగ్ బాక్సులు రెడీగా ఉన్నాయి. 42 మంది ఆర్వోలు, అసిస్టెంట్ ఆర్వోలు 42 మందిని నియమించారు. పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు కలిపి 1196 మందిని నియమించారు. 29 మంది జోనల్ ఆఫీసర్లు, ఆరుగురు ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ 12 ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్స్ 25 మందిని నియమించారు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో 141 వార్డులు 2, 26, 586 మంది ఓటర్లు ఉండగా కోదాడలో 3, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఒక వార్డ్ ఏకగ్రీవం అయింది. మిగిలిన 137 వార్డులలో 567 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 372 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 158 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 28 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను గుర్తించారు.
5 మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 59 రూట్ లను ఏర్పాటు చేయగా 61 మంది జోనల్ ఆఫీసర్స్, 59 రూట్ ఆఫీసర్స్, 70 మంది ఆర్‌ఓ, 68 మంది ఏఆర్‌ఓ, 475 మంది పీఓ, 475 మంది ఏపీఓ,1425 మంది ఓపీఓ, 158 మంది మైక్రో అబ్జర్వర్స్ కలిపి మొత్తం 2850 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాల్లో 1250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు -2, డీఎస్పీలు - 4, సిఐలు 12, ఎస్సైలు 50, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్ళు 265, కానిస్టేబుళ్ళు -760, - ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులను నిర్వహించనున్నారు.
