మాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బందికి జరిమానా

మాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బందికి  జరిమానా
  • మున్సిపల్ సిబ్బందిని వదిలిపెట్టని అధికారులు

రంగారెడ్డి జిల్లా: మాస్కులు ధరించని మున్సిపల్ సిబ్బంది నలుగురికి మొదటి తప్పుగా వంద రూపాయల చొప్పున జరిమానా విధించిన ఘటన నార్సింగి మున్సిపాలిటీలో జరిగింది. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ ను అడ్డుకునేందుకు ఏం చేస్తున్నారంటూ కోర్టులు మొట్టికాయలు వేస్తుండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాలకులు, అధికారులు రోజు రోజుకూ ఆంక్షలు కఠినం చేస్తున్నారు. గుంపులు గుంపులు తిరగకుండా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, తరచూ శానిటైజ్ చేసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రచార కార్యక్రమాలు మళ్లీ ముమ్మరం చేశారు. మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతోపాటు.. వారాంతాల్లో లాక్ డౌన్ విధించినా పరిస్థితి అదుపుకాకపోవడం గుబులు రేపుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా గుంపులు గా తిరుగుతూ కేసులు వ్యాపింపచేస్తుంటే లాక్ డౌన్ విధించే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ అధికారులు ఒకడుగు ముందుకేశారు.

వీధుల్లో తిరుగుతూ మాస్కులు లేకుండా తిరిగినా.. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరిగినా జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాదు కట్టుదిట్టంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజలు పెద్దగా పట్టించుకోనట్లు కనిపించకపోవడంతో అధికారులు కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. జరిమానా రశీదు పుస్తకాలు తీసుకుని రోడ్డుపై తనిఖీలు చేపట్టారు. సొంత మున్సిపల్ కార్యాలయ సిబ్బందే మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వహించడం కంటపడడంతో ఏ మాత్రం ఉపేక్షించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్సింగి మున్సిపాలిటి శానిటరీ సూపర్ వైజర్ లచ్చిరాం నాయక్ మాస్కు ధరించ కుండా విధులు నిర్వహిస్తున్న నలుగురు మున్సిపల్ సిబ్బందికి వంద రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఒకవైపు తామంతా వీధి వీధినా తిరుగుతూ మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయట తిరగొద్దని  గొంతు నొప్పి పుట్టేటట్లు ప్రచారం చేస్తుంటే..  తమ సిబ్బంది కొందరు నిర్లక్ష్యం వహించడంపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. మొదటి తప్పుగా హెచ్చరిస్తూ వంద రూపాయల జరిమానా విధించారు. నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు చేయించుకునేందుకు, వ్యాక్సిన్ తీసుకోవడానికి చుట్టుపక్కల నుండి ఇక్కడికి తరుచుగా జనాలు వచ్చిపోతుండడం గుర్తించి ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.