చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి మంజూరైన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించిన ఆయన, రెండు కళాశాలలు ఒకే క్యాంపస్‌లో వచ్చేలా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఆర్డీవో, ఎమ్మార్వోలకు సూచించారు. అనంతరం చండూరు పీహెచ్సీ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పక్కనే ఉన్న దేవాదాయ శాఖ భూమిని పీహెచ్‌సీకి కేటాయించాలని ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే నివేదిక తెప్పించుకొని భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అరెగూడెంలో విగ్రహ ప్రతిష్ఠాపన
చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం అరెగూడెం గ్రామంలోని సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మొక్కితే కష్టాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయని, గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

