
- రూ.500 కోసం హత్యలు
- అయిదుగురిని చంపిన సైకో కిల్లర్ కిష్టప్ప అరెస్ట్
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంజీవ్ రావు
వికారాబాద్ జిల్లా, వెలుగు: రాష్ట్రంలో సీరియల్ కిల్లర్స్ పెరిగిపోతున్నారు. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి 16 హత్యలు చేసిన మైన రాములు ఉదంతం మరిచిపోకముందే. 500 రూపాయలు, సెల్ఫోన్ కోసం దారుణంగా హత్యలు చేసిన సైకో కిల్లర్ మాల కిష్టప్పను వికారాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను కూడా ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ఇప్పటి వరకు ఐదు హత్యలు చేసినట్టు డీఎస్పీ సంజీవ్ రావు బుధవారం మీడియాకు చెప్పారు. దారూర్ మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మ(35) అడ్డా కూలీ. ఫిబ్రవరి 25న పని కోసం వికారాబాద్ వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వికారాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 26న గెరిగెట్‌పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్పను అరెస్టు చేశారు. కల్లు తాగించి రూ.500, ముక్కుపుడక కోసం హత్య చేసినట్లు ఆధారాలు సేకరించారు. దారూర్ లోని ఓ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టుపెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అడ్డా కూలీలే టార్గెట్
అడ్డా కూలీ మహిళలనే టార్గెట్ చేసి ఇప్పటి వరకు కిష్టప్ప ఐదు హత్యలు చేసినట్లు పోలీసు లు గుర్తించారు. ఇప్పటికే పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కిష్టప్ప ఫోన్, రూ.500, రూ.800, ముక్కు పుడక కోసం హత్యలు చేసినట్లు చెప్పారు. 1999లో దారూర్‌లో, 2008లో యాలాల్ లో, తాండూరులో 2010లో, 2016లో వికారాబాద్లో హత్యలు చేశాడని వివరించారు. రెండు కేసుల్లో మహిళలను గుర్తు పట్టకుండా కాల్చివేసినట్టు చెప్పారు.