
జవహర్నగర్, వెలుగు: ఈ నెల 24న జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో జరిగిన వివాహిత మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అనుమానంతో భార్యను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడని జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఏసీపీ శివకుమార్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన విజయ్(30), తన భార్య శాంతి(28)తో కలిసి కొంతకాలం క్రితం సిటీకి వచ్చి జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు చరణ్(11), తరుణ్(9), వరుణ్(9) ఉన్నారు. ఇద్దరు కుమారులను నంద్యాలలోని తన తల్లి దగ్గర ఉంచిన విజయ్..చిన్న కొడుకుని తమ దగ్గరే ఉంచుకున్నాడు.
మూడేళ్ల క్రితం విజయ్ భార్య శాంతిపై అనుమానంతో వేధిస్తే పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్దిచెప్పారు. అయినా విజయ్ తీరు మారలేదు. రోజూ మద్యం తాగొచ్చి శాంతిని వేధించేవాడు. ఈ నెల 24న రాత్రి 11గంటల ప్రాంతంలో మరోసారి శాంతితో గొడవపడిన విజయ్ ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత విజయ్ తన చిన్న కొడుకుని తీసుకుని నంద్యాలకు వెళ్లిపోయాడు. కొడుకుని తీసుకుని చెప్పకుండా వచ్చిన విజయ్ ని కోడలు రాలేదా అని నంద్యాలలో తల్లిదండ్రులు అడిగారు. వారికి విజయ్ సమాధానం చెప్పలేదు. అతడి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన తల్లిదండ్రులు జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలోనే ఉంటున్న తమ బంధువు ఓబులేషుకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఓబులేషు వెంటనే అక్కడి ఇంటికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా..శాంతి చనిపోయి ఉంది. ఓబులేషు జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. శాంతి హత్య అనంతరం విజయ్ కనిపించకపోవడంతో అతడే చంపి ఉంటాడని అనుమానించిన పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఆదివారం నంద్యాలలో విజయ్ ని అదుపులోకి తీసుకుని విచారించగా..తానే చంపినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. విజయ్ ని రిమాండ్ కి తరలించినట్టు ఏసీపీ శివకుమార్ తెలిపారు.