ఆశా వర్కర్స్ నిజమైన హెల్త్ వారియర్స్: రాహుల్ గాంధీ

ఆశా వర్కర్స్ నిజమైన హెల్త్ వారియర్స్: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్‌‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. గుర్తింపు పొందిన సోషల్ హెల్త్‌ యాక్టివిస్ట్‌ (ఆశా) వర్కర్స్ విషయంలో ప్రభుత్వ ఉదాసీనతపై రాహుల్ మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆశా కార్యకర్తలు సమ్మెకు దిగనున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గవర్నమెంట్‌ను దుయ్యబడుతూ ట్వీట్ చేశారు.

‘ఆశా వర్కర్‌‌లు దేశంలోని ఇంటింటికీ చేరుకోగలరు. వారు నిజమైన హెల్త్ వారియర్స్‌. కానీ వాళ్ల సొంత హక్కుల కోసం ఆశా వర్కర్‌‌లు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇన్నాళ్లూ మూగబోయిన ప్రభుత్వం.. ఇప్పుడు చెవిటిగా, గుడ్డిగా మారింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్ అందించకపోవడంతోపాటు తక్కువ జీతాలు ఇస్తున్నారనే కారణంతో రెండ్రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు దిగాలని ఆశా కార్యకర్తలకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ‘మాకు నెలకు రూ. 2 వేల జీతం మాత్రమే ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేం పని చేస్తున్నాం. మాకు మాస్కులు, శానిటైజర్స్ అందివ్వడం లేదు’ అని మహారాష్ట్రకు చెందిన సులోచనా రాజేంద్ర సబ్డే అనే 45 ఏళ్ల ఆశా వర్కర్ వాపోయింది.