మా నాన్నలో ఎన్నడూ కోపం చూడలె

మా నాన్నలో ఎన్నడూ  కోపం చూడలె

హైదరాబాద్​, వెలుగు:‘మా బాపు(పీవీ నరసింహారావు)కు స్వాభిమానం ఎక్కువ. ఎవరి మీద ఆధారపడేవారు కాదు. తన పనులు తానే చేసుకునేవారు. తన ఆత్మకథ ఇన్‌సైడర్‌ బుక్‌ చాలా వరకు తన ఒకే వేలితో టైప్‌ చేశారు. 60 ఏండ్ల వయసులో టైపింగ్‌ నేర్చుకున్నరు. బాపు హిందీ మాట్లాడితే ఉత్తరాది అని.. మరాఠిలో మాట్లాడితే మహారాష్ట్రలో ఎక్కడా.. అని అడిగేవారు. తన జీవితంలో కోపగించుకోవడమే చూల్లే’ అని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి అన్నారు. పీవీ గురించి ఇంట్రెస్టింగ్‌ ముచ్చట్లను ‘వీ6 –వెలుగు’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే..

నో జెండర్‌ డిస్క్రిమినేషన్‌.. ఫుల్ ఫ్రీడం..

బాపు మాపై ఏదీ కావాలని రుద్దేవారు కాదు. ఎవరికి ఏది ఇష్టముంటదో అదే చేయమంటరు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్‌ పెట్టేవారు కాదు. మగ పిల్లలే చదవాలి.. అమ్మాయిలు చదవొద్దు అనేది ఉండేది కాదు. తెలివికి జెండర్‌ ఉండదనేవారు. జెండర్‌ డిస్క్రిమినేషన్‌ లేదు. అందరినీ ఒకేలా చూశారు. పూర్తి ఫ్రీడం ఇచ్చారు.

నాటి రాజకీయాలు ఎలక్షన్స్‌ దాకే ఉండేవి..

బాపు కాలమంతా ఎంతో గొప్పది. నాడు రాజకీయాలు ఎలక్షన్స్‌ వరకే ఉండేవి. ఎవరు గెలిచినా అందరూ దేశం గురించి మాట్లాడేవారు. ప్రజల బాగు కోసం అసెంబ్లీ, పార్లమెంట్‌లో అడిగేవారు. బాపు ప్రధానమంత్రిగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రాబ్లమ్స్‌ వచ్చినప్పుడు భయపడవద్దనేవారు. ప్రతి ఎదురుదెబ్బను గుణపాఠంగా భావించారు.

సోనియాను ఎప్పుడూ పల్లెత్తు మాటనలేదు

పాలిటిక్స్‌ గురించి బాపు ఎప్పుడూ మాతో మాట్లాడేవారు కాదు. నా సోదరులు రంగారావు, రాజేశ్వర్‌రావు.. బాపు మాట్లాడుకునేవారు. నాకు పాలిటిక్స్‌ తెలియదు. మేమెప్పుడూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని బాపు విమర్శించడం చూడలేదు. ఆమె ఎప్పుడూ బాపుపై కోపం ప్రదర్శించలేదు.

అంతిమ సంస్కారంపై ఇప్పటికీ బాధనిపిస్తది

నేను ఏ ప్రభుత్వాన్ని, ఏ పార్టీనీ విమర్శించడం లేదు. బాపు అంతిమ సంస్కారానికి వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. వాళ్లు చేయలేకపోవడం వారి దౌర్భాగ్యం. వాళ్లను ఇంతకంటే ఎక్కువ అనం. కన్న తండ్రికి చివరి క్రియలు కూడా సరిగా చేయలేదు. బాధ్యత తీసుకుని సరిగా చేయకపోవడం వాళ్ల ఫెయిల్యూర్‌. అది ఇప్పటికీ బాధనిపిస్తుంది. ఎప్పటికీ మాయని మచ్చ. దీనికి వాళ్లే సమాధానం చెప్పాలి. మాకు వారిపై ఎలాంటి కోపం లేదు.

ఇన్ సైడర్ 2 ప్రింట్ చేయిస్తం

బాపు 60 ఏండ్ల వయసులో కంప్యూటర్‌ నేర్చుకున్నరు. పేజ్‌ మేకర్‌ మొదలుకొని, లాంగ్వేజెస్‌ వరకు అన్నీ వచ్చు. అది ఆయన ప్యాషన్‌. ఇన్‌సైడర్‌ –2 బుక్‌ టైప్‌ చేశారు. ప్రింటింగ్‌ చేయిస్తం.

పొద్దుగాల్నే నిద్రలేస్తుండె

బాపు మిత ఆహారం తీసుకునేవారు. రోజూ ఉదయం 4గంటలకే నిద్రలేచేవారు. సాయంత్రం 4 గంటలకు షటిల్‌ ఆడేవారు. బాపుకు ఆయుర్వేదం బాగా తెలుసు. బాపు నోటి వెంట ఎప్పుడూ ‘నేను బిజీ’ అనే మాట రాలేదు. రాజకీయం రంగంలోకి రాకుంటే సాహిత్యంలో గొప్ప వ్యక్తి అయ్యేవారు. నోబెల్‌ ప్రైజ్‌ వచ్చేది. బాపుకు సాహిత్యం చాలా ఇష్టం.

కాళోజీ ‘రార.. పోరా’ అంటుండె

బాపు కంటే కాళోజీ పెద్దవారు. బాపును ‘ఏరా, రారా, పోరా’ అనే వారు. ఒకసారి ఏదో ఫంక్షన్‌లో కాళోజీ కలిసి బాపు గురించి అడిగారు. ‘వాడెక్కడున్నడమ్మ.. వాడు మంచిగున్నడా’ అని సంబోధిస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను.