- తిరుగు పయనంలో కామారెడ్డిలో కనిపించి, కనుమరుగు
- మహారాష్ట్ర వెళ్లిందని మనోళ్లు.. రాలేదంటున్న అక్కడి ఆఫీసర్లు
- వేటగాళ్ల ఉచ్చులో చిక్కిందా? అని సందేహాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదారు నెలలపాటు అటవీ శాఖ అధికారులను పరుగులు పెట్టించి.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ పులి ఇప్పుడు ఎక్కడుంది? ఏమైపోయింది?.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దులు దాటి యాదగిరిగుట్ట దాకా వచ్చి ఎటుపోయిందనే చర్చ నడుస్తోంది. తడోబాలోని తన సామ్రాజ్యానికి సురక్షితంగా వెళ్లిందా? అడవిలో మిస్సయిందా? లేక వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ప్రాణాలు కోల్పోయిందా అన్నది తెలియడం లేదు.
అయితే, పులి సేఫ్‌గా తన స్థావరానికి చేరిందని మన ఆఫీసర్లు చెబుతుంటే.. తమ దగ్గరికి రాలేదని మహారాష్ట్ర అధికారులు అంటుండటం అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పులి.. అడవిబాట పట్టి వందల కిలోమీటర్లు ప్రయాణించింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మీదుగా తెలంగాణలోకి అడుగుపెట్టి.. ఎవరూ ఊహించని విధంగా యాదగిరిగుట్ట వరకు సుదీర్ఘ పయనం సాగించింది.
దారి పొడవునా పశువులపై దాడులు చేస్తూ అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చింది. కొద్దిరోజులు యాదగిరిగుట్ట పరిసరాల్లో సంచరించి ఇటు ఫారెస్ట్ ఆఫీసర్లను.. అటు ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. దాన్ని పట్టుకునేందుకు పుణే నుంచి ప్రత్యేక టీంలను సైతం రప్పించారు. వందలాది కెమెరా ట్రాప్స్ అమర్చారు. ఎక్కడికక్కడ బోన్లు పెట్టారు. అయినా పులి చిక్కలేదు. ఈ క్రమంలోనే అది తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. దీంతో ఫారెస్ట్ఆఫీసర్లు అది తన స్థావరానికి వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు.
కామారెడ్డి దాటాక కనిపించలే!
పులి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట, జగిత్యాల జిల్లాల మీదుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించింది. కొన్ని రోజులపాటు కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో దాని కదలికలు కనిపించాయి. అప్పట్లో కెమెరా ట్రాప్స్‌లోనూ పులి ఫొటోలు రికార్డయ్యాయి. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కామారెడ్డి దాటిన తర్వాత పులి జాడ ఎక్కడా కనిపించలేదని సమాచారం. అయితే, రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పులి ఏమైందనేది అంతుచిక్కడం లేదు. ఎటు వెళ్లిందో కనిపెట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ట్రాకింగ్ సరిగా చేయలేకపోవడం వల్లే పులి మిస్సయిందనే ఆరోపణలున్నాయి.
వేటగాళ్ల ఉచ్చులో చిక్కిందా?
అసలు పులి క్షేమంగానే ఉందా? లేక ఏదైనా ప్రమాదానికి గురైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు లేదా ఉచ్చుల్లో చిక్కి చనిపోయి ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా పులి ఒక ప్రాంతంలో సంచరిస్తే దాని పాదముద్రలు లేదా మల విసర్జన ద్వారా గుర్తులు దొరుకుతాయి. కానీ, కొన్ని రోజులుగా ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఒకవేళ వేటగాళ్ల పనే అయితే.. ఆ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెలల తరబడి వందల కిలోమీటర్లు ప్రయాణించిన పులి.. చివరకు ఇలా మిస్టరీగా మారిపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
