మరో పెండ్లికి అడ్డుగా ఉన్నారనే.. భార్యాబిడ్డల హత్య

మరో పెండ్లికి అడ్డుగా ఉన్నారనే..  భార్యాబిడ్డల హత్య
  •     హనుమకొండ జిల్లా పున్నేలులో మహిళ, 
  • ఇద్దరు చిన్నారుల హత్య కేసులో వీడిన మిస్టరీ
  •     స్విమ్మింగ్ పూల్‌లో ముంచి చంపినట్లు తేల్చిన పోలీసులు
  •     ప్రధాన నిందితుడు అజారుద్దీన్‌ సహా 
  • 10 మంది అరెస్ట్, పరారీలో ఇద్దరు డాక్టర్లు

హనుమకొండ, వెలుగు :   హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు శివారులోని స్విమ్మింగ్‌‌ పూల్‌‌లో తల్లీకూతుళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. ఆడ పిల్లలు పుడుతున్నారన్న అసంతృప్తి, అబార్షన్‌‌కు ఒప్పుకోవడం లేదన్న అసహనం, కొడుకు కోసం మరో పెండ్లి చేసుకుందామంటే అడ్డుకుంటుందన్న కోపంతో భర్తే తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్‌‌ పూల్‌‌లో ముంచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్‌‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అబార్షన్లకు సహకరించిన ముగ్గురు డాక్టర్లు సహా మొత్తం 12 మందిపై కేసు నమోదు చేయగా.. శుక్రవారం పది మందిని అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌ కమిషనరేట్‌‌లో శుక్రవారం సీపీ సన్‌‌ ప్రీత్‌‌సింగ్‌‌ వెల్లడించారు.

ఆడపిల్లలని తెలిసి రెండు సార్లు అబార్షన్‌‌

పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫరాహత్ (26) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వరంగల్‌‌ – ఖమ్మం హైవేకు సమీపంలో పున్నేలు క్రాస్‌‌ వద్ద ఓ స్విమ్మింగ్‌‌ పూల్‌‌ నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఉమేరా (9), అయేషా (6) పిల్లలు ఉన్నారు. ఫరాహత్‌‌ 2021లో మరోసారి గర్భం దాల్చగా లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకు పున్నేలులో మెడికల్‌‌ షాప్‌‌ నడుపుతున్న సట్ల రాజు, కొండపర్తిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న లింగాల నరేశ్, ఏనుగల్లు గ్రామానికి చెందిన మెడికల్ షాప్ ఓనర్ వాంకుడోతు భద్రు ద్వారా కాజీపేట సురక్ష హాస్పిటల్‌‌లో లోని డాక్టర్ రవళిని సంప్రదించారు. ఆమె కడిపికొండకు చెందిన నర్సు స్రవంతి, గీసుగొండకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్‌‌ బొమ్మెర మనోహర్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించగా.. ఆడపిల్ల అని తేలింది. దీంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బాల్నే పూర్ణిమ, నెక్కొండలోని ఉపేందర్ హాస్పిటల్ డాక్టర్ బాల్నే పార్ధు సహకారంతో అబార్షన్‌‌ చేశారు. 2022లోనూ ఫరహత్‌‌ మరోసారి గర్భం దాల్చగా.. అప్పుడు కూడా ఆడపిల్ల అని తెలియడంతో మళ్లీ అబార్షన్‌‌ చేయించారు. కొన్ని రోజుల కింద ఫరహత్‌‌ మరోసారి గర్భం దాల్చింది. అయితే మళ్లీ అమ్మాయే పుడుతుందన్న భయంతో అబార్షన్‌‌ చేసుకోవాలని అజారుద్దీన్, అతడి తల్లిదండ్రులు చాంద్‌‌పాషా, సలీహా, తమ్ముడు షరోద్దీన్‌‌ కలిసి ఫరహత్‌‌పై ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్‌‌ చేయడంతో మరోసారి అబార్షన్‌‌ చేయించుకునేందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంలో ఫరాహత్, అజారుద్దీన్‌‌ మధ్య గొడవలు జరుగుతున్నాయి.

మరో పెండ్లికి ప్లాన్‌‌.. అడ్డుగా ఉందని భార్యాపిల్లల హత్య

కొడుకు కావాలనే ఆశతో ఉన్న అజారుద్దీన్‌‌ మరో పెండ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు దూరపు బంధువైన ఓ మైనర్‌‌ను పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ అజారుద్దీన్‌‌కు అప్పటికే భార్యా, ఇద్దరు పిల్లలు ఉండడంతో ఆ బాలిక ఒప్పుకోలేదు. దీంతో తన పెండ్లికి అడ్డుగా ఉన్న భార్యాపిల్లలను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 1న రాత్రి 7.50 గంటల టైంలో ఐస్‌‌క్రీమ్‌‌ తినిపిస్తానని చెప్పి భార్యాపిల్లలను స్విమ్మింగ్‌‌పూల్‌‌ వద్దకు తీసుకెళ్లాడు. ముందస్తు ప్లాన్‌‌ ప్రకారం అక్కడ సీసీ కెమెరాలు, కరెంట్‌‌ సప్లై ఆఫ్‌‌ చేశాడు. అనంతరం భార్య ఫరాహత్‌‌తో పాటు ఇద్దరు పిల్లలను పూల్‌‌లోకి తోసేశాడు. తర్వాత తాను కూడా పూల్‌‌లోకి దిగి ముగ్గురినీ నీటిలోకి అదిమిపెట్టాడు. వారి చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. తాను టాయ్‌‌లెట్‌‌కు వెళ్లొచ్చే సరికి ముగ్గురూ నీళ్లలో పడి చనిపోయారని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఫరాహత్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారణ చేసిన అనంతరం అజారుద్దీనే తన భార్యాపిల్లలను హత్య చేసినట్లుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లే హత్యకు కారణంగా గుర్తించారు. ఈ మేరకు ఎండీ.అజారుద్దీన్‌‌, అతడి తల్లిదండ్రులు చాంజ్‌‌పాషా, సలీహా, తమ్ముడు ఎండీ.షరోద్దీన్‌‌తో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లకు సహకరించిన డాక్టర్‌‌ బాల్నే పార్ధు, నర్సు బస్కే స్రవంతి, ల్యాబ్ టెక్నిషియన్‌‌ మనోహర్, ఆర్ఎంపీ లింగాల నరేశ్, మెడికల్‌‌ షాప్ నిర్వాహకులు సాట్ల రాజు, వాంకుడోతు భద్రును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు లేడీ డాక్టర్లు బాల్నే పూర్ణిమ, ఎస్.రవళి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.