న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో మరణించినవారి సంఖ్య 13కు పెరిగింది. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిలాల్ హసన్(35) గురువారం చనిపోయాడు. పేలుడుతో దూసుకువచ్చిన శకలాలు బిలాల్ కడుపులోని పేగులు, ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో అతను చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో ముగ్గురు ఇంకా ఐసీయూలోనే ఉన్నారని తెలిపారు.
కాగా, ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో మృతుల శరీర అవయవాలు ఘటనా స్థలానికి ఏకంగా 300 మీటర్ల దూరం వరకూ ఎగిరిపడినట్టుగా పోలీసులు గుర్తించారు. స్పాట్‌కు 300 మీటర్ల దూరంలోని న్యూ లజపతిరాయ్ మార్కెట్లో ఓ దుకాణం పైకప్పు మీద తెగిపోయి పడి ఉన్న ముంజేయిని వారు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆ చేయిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
కార్డియాలజీ స్టూడెంట్ అదుపులోకి
ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనలో కాన్పూర్ కార్డియాలజీ స్టూడెంట్ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని మొహమ్మద్ ఆరిఫ్ (32)గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్ నాగ్‌కు చెందిన ఆరిఫ్.. కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఢిల్లీ బ్లాస్ ఘటనలో ఇదివరకే అరెస్టయిన లేడీ డాక్టర్ షాహీన్ సయీద్ తో అతడికి సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
జిగ్‌జాగ్ రూట్లలో ఢిల్లీకి ఉమర్
ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ.. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి జిగ్‌జాగ్ రూట్లలో ప్రయాణించాడని విచారణలో తేలింది. ఆదివారం రాత్రి ఫరీదాబాద్ నుంచి కారులో బయలుదేరిన అతడు.. సోమవారం సాయంత్రం వరకు ఎర్రకోట వద్దకు చేరుకున్నాడు.
మెయిన్ రోడ్ల ద్వారా కాకుండా రద్దీ ఉండే మార్గాల గుండా స్లోగా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో ఫిరోజ్‌పూర్‌కు చేరుకున్న తర్వాత రోడ్ సైడ్ దాబాలో డిన్నర్ చేశాడు. రాత్రి అక్కడే కారులో పడుకున్నాడు. మొత్తం 50 సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు.. ఏయే మార్గాల్లో ఉమర్ ఢిల్లీకి చేరుకున్నాడనేది కనిపెట్టారు.
అల్ ఫలా వర్సిటీకి న్యాక్ నోటీసు
న్యాక్ గుర్తింపు లేకపోయినా, ఉన్నట్లు వెబ్ సైట్లో తప్పుడు సమాచారం ఉంచినందుకు అల్ ఫలా యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(న్యాక్) నోటీసు పంపిందని అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘అల్ ఫలా వర్సిటీకి న్యాక్ గుర్తింపు లేదు. గుర్తింపు కోసం అప్లై కూడా చేసుకోలేదు.
కానీ, గుర్తింపు ఉన్నట్లు వెబ్ సైట్ లో తప్పుడు సమాచారం ఉంచారు. ఇది స్టూడెంట్లు, పేరెంట్లు, స్టేక్ హోల్డర్లను తప్పుదారి పట్టించడమే” అని ఆ నోటీసులో తెలిపారు. వెబ్ సైట్ లో ఉంచిన తప్పుడు సమాచారం తొలగించాలని, అలాగే సంజాయిషీ ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ముజఫర్‌పై రెడ్ కార్నర్ నోటీసు
ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న జమ్మూకాశ్మీర్‌లోని ఖాజీగుండ్‌కు చెందిన డాక్టర్ ముజఫర్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను సంప్రదించారు. ముజఫర్.. డాక్టర్ ఆదిల్ సోదరుడు. ఎర్రకోట పేలుడు కేసులో అరెస్టయిన ముగ్గురు డాక్టర్లతోపాటు మిగతా ఐదు మంది టీంలో ముజఫర్ ఒకడు. అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ఏడుగురు కాశ్మీర్‌కు చెందినవారు.
వారిని విచారించిన సమయంలో ముజఫర్ పేరు బయటపడింది. సోమవారం ఎర్రకోట వద్ద పేలిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడిపిన ముజమ్మిల్ తో పాటు ఉమర్ నబీ సహా 2021లో తుర్కియేను సందర్శించిన డాక్టర్ల బృందంలో ముజఫర్ ఉన్నాడని వారు చెప్పారు. కాగా, ముజఫర్ ఆగస్టులోనే దుబాయ్‌కి వెళ్లాడని, ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు.
