
- అందరూ కలిసి పని చేయండి.. కలుపుకొని పోండి.. పార్టీని బలోపేతం చేయండి
రాష్ట్రంలో పోస్ట్ మాన్ తరహాలో నాయకులు పని చేస్తే సరిపోదని, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడకపోతే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. వారంలో ఒకరోజు ఏదైనా ఒక నియోజకవర్గంలో పర్యటించాలన్నారు. పది పాయింట్స్ ఫార్ములా పెట్టుకుని అందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి మంచి అవకాశం ఉందని, ఇందుకోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలను అందరూ కలిసికట్టుగా అమలు చేయాలన్నారు. పదాధికారులు బూత్ స్థాయిలో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో త్వరలో తాను చేపట్టే పర్యటన సమయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేర్చుకునేలా చూడాలని పార్టీ నాయకులకు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం చేయాలన్నారు. యువ మోర్చా అధ్యక్షులు వివిధ క్రీడలు, యూత్ అసోసియేషన్ ల సభ్యుల వద్దకు వెళ్లి, మాట్లాడాలన్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు మహిళా సంఘాలతో తరచూ టచ్ లో ఉండాలన్నారు. దళితవాడలను సందర్శించాలని, అక్కడే సగం ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. గ్రామాలకు వెళ్లిన ప్రతి నేత కనీసం అరగంట పాటు దళిత కాలనీలో ఉండాలని, లేదంటే ఆ పర్యటన వృథానే అవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అవినీతి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చ పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీస్తోందని, దీనిపై ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలోకి వచ్చే నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అందరికీ అవకాశం ఉంటుందని, అధికారంలోకి రాకపోతే ఏం చేయలేమన్నారు. ‘నా కంటే బలమైన నేతను పార్టీలోకి తీసుకురావాలి’ అని ప్రతి ఒక్క నాయకుడు అనుకోవాలన్నారు. అన్ని విభాగాల్లో బీజేపీతో సమానమైన పార్టీ ఏది లేదన్నారు. కాంగ్రెస్ తో పాటు దేశంలో అన్ని కూడా కుటుంబ పార్టీలే అన్నారు. ‘అందరూ కలిసి పని చేయండి.. కలుపుకొని పోండి.. పార్టీని బలోపేతం చేయండి’ అంటూ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రణాళిక బద్దంగా పని చేసి, బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ లో బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన మహేశ్వరంలో బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానుండటంతో భారీగా జన సమీకరణ చేయాలని, పార్టీ పటిష్టత కోసం అందరూ కష్టపడాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర నేతలకు చెప్పారు. ‘కూర్చీ పోతుందని చూడకండి.. మీ విషయం పార్టీ చూసుకుంటుంది’ అంటూ భరోసా ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం..