- నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
కందనూలు, వెలుగు: రైతులకు లాభదాయక వ్యవసాయ వంగడాలను కనుగొనాలని నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం బిజినపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన , విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరోగ్యానికి హాని కలిగించని, పర్యావరణ అనుకూలమైన పద్ధతులను అవలంభించాలని సూచించారు.
ఆధునిక సాంకేతికతతో మానవ శ్రమను తగ్గించుకోవాలని, వాతావరణ మార్పులను తట్టుకునే లాభదాయక వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించాలని కోరారు. అనంతరం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
నాగర్ కర్నూల్ టౌన్: జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని 15 ఆస్పత్రులు, 3 స్కానింగ్ సెంటర్ల అనుమతుల దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో బాలికలపై వివక్షను నివారించడమే చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలన్నారు.

