
- పాలమూరు, కల్వకుర్తి, డిండి భూ సేకరణ రివ్యూ
నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు -రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల పథకాలు,అచ్చంపేట,మార్కండేయ లిఫ్టులకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ స్పెషల్ ఆఫీసర్ రవినాయక్, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు నీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ప్రధాన ప్రాజెక్టులలో ప్యాకేజీల వారీగా జరుగుతున్న పనులను ఇంజనీరింగ్అధికారులను అడిగారు.
భూ సేకరణలో సమస్యలు వస్తున్న ప్రాంతాల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పర్యటించి రైతుల సందేహాలను తీర్చాలన్నారు. కల్వకుర్తి లిఫ్ట్‌లోని 30వ ప్యాకేజీలో 598 ఎకరాలకు గాను 319 ఎకరాలకు సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించామన్నారు. 279 ఎకరాల భూ సేకరణ వివిధ నోటిఫికేషన్, అవార్డు దశలలో ఉంది. హాజీపూర్, నడింపల్లి, చంద్రాపూర్ ఏరియాలకు నీరు వెళ్లేందుకు అవసరమైన 54 ఎకరాలు సర్వే దశలో ఉందన్నారు. అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఇరిగేషన్ సీఈ విజయ్ భాస్కర్, ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి. ఈఈ శ్రీకాంత్, మురళి, ఆర్డిఓలు మాధవి, బన్సీలాల్, సురేశ్, శ్రీనివాస్, సర్వే అధికారి సరిత, తహసీల్దార్లు పాల్గొన్నారు.