నాగార్జునసాగర్ డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ డ్యామ్ 4  గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్  డ్యామ్ గేట్లు ఎత్తివేశారు.  వరద పరవళ్లు తొక్కుతూ పూర్తిగా నిండిపోయే పరిస్థితి రావడంతో డ్యామ్ కు ఉన్న నాలుగు క్రస్ట్ గేట్లు  ఐదడుగుల ఎత్తు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నరసింహ కలసి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలకు తోడు ఎగువన కర్నాటక, మహారాష్ట్ర, ఏపీలోని అన్ని ప్రాజెక్టులు పొంగి పారుతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ కు భారీ వరద పోటెత్తుతోంది.

గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టులోనే నాగార్జున సాగర్ డ్యామ్ గరిష్ట నీటి మట్టనికి చేరుకోవడంతో గేట్లు తెరచుకున్నాయి. ఎగువన శ్రీశైలం డ్యామ్ వద్ద అన్ని గేట్లు ఎత్తేసి నాలుగు లక్షలకు పైగా వరద వదులుతున్నారు. దీంతో ఈ వరద వేగంగా సాగర్ కు చేరుకుంటోంది. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు.. 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం  585  అడుగులకు చేరుకున్నది. నీటి మట్టం 290 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ఇన్ ఫ్లో విషయానికి వస్తే  4 లక్షల  క్యూసెక్కులు పైబడిన వరద వస్తోంది. వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండడంతో డ్యామ్ గరిష్ట నీటిమట్టం కొనసాగిస్తూ.. వరద ప్రవాహానికి అనుగుణంగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.వరద పెరిగే కొద్దీ మరికొన్ని గేట్లు కూడా  ఎత్తి విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. తొలుత ఎమ్మెల్యే ద్వారా రెండు గేట్లు  తెరచిన అధికారులు కొద్దిసేపటి కే మరో రెండు గేట్లు ఎత్తారు. మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.