నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు-, రంగారెడ్డి, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణలో ఎదురవుతున్న కోర్టు కేసులు, రైతుల అభ్యంతరాలను పరిష్కరించి వారికి సకాలంలో పరిహారం అందేలా చూడాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు సూచించారు.
ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి వారం పురోగతి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఇరిగేషన్ ఎస్సీలు పార్థసారథి, సత్యనారాయణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
