ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు..కోట్లలో వ్యాపారం చేస్తున్న ఓ బొగ్గు వ్యాపారి..వేలల్లో వచ్చే వడ్డీకి ఆశపడి..కోట్లు కోల్పోయాడు. విదేశాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామన్న ఓ ముఠా మాయ మాటలు నమ్మి ఒక రూపాయి కాదు..రెండు రూపాయలు కాదు..ఏకంగా రూ. 5 కోట్ల 39 లక్షలు మోసపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
నాగ్ పూర కు చెందిన బొగ్గు వ్యాపారి అంకుర్ కుమార్ అగర్వాల్ ను 18 మంది వ్యక్తుల ముఠా మోసం చేసింది. మందార్ కోల్టే అనే వ్యక్తి..అంకుర్ కుమార్ తో సన్నిహితంగా మెలిగి..విదేశాల్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. తన స్నేహితులు కూడా ఇలానే పెట్టుబడులు పెట్టి..అధిక మొత్తంలో సంపాదిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. అంకుర్ కుమార్ అగర్వాల్ నమ్మేలా ముంబైలోని పలు ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు కూడా ఏర్పాటు చేశాడు. బాధితుడు అంకుర్ కుమార్ అగర్వాల్ పూర్తిగా నమ్మిన తర్వాత బాధితుడి బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 5.39 కోట్లు నిందితులు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ఇందుకు డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ నకిలీదని తేలడంతో మోసపోయానని గ్రహించాడు బాధితుడు అంకుర్ కుమార్.
ALSO READ : నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 5.39 కోట్ల రూపాయలు మోసపోవడంతో బాధితుడు అంకుర్ కుమార్ అగర్వాల్ లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

