కేటీఆర్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భ్రమల్లో బతుకుతున్నాడు..నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్

కేటీఆర్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భ్రమల్లో బతుకుతున్నాడు..నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్
  • నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్
  • మేడిగడ్డకు నేరస్తులే పరామర్శకు వెళ్లినట్లుందని ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసి డెంట్  కేటీఆర్  ఓ క్యారెక్టర్ ఆర్టిస్టని, ఆయన గిమ్మిక్కులు, విన్యాసాలను జనం నమ్మరని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్  ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందల శ్యామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్  రెడ్డి అన్నారు. ఆ నలుగురు శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని, ఆయన పారానైడ్  స్కీజోఫ్రీనియా వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియాకు కేటీఆర్  సమాధానం చెప్పలేక, చీకటి గదుల్లో వీడియోలు చేసి పెడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారం పోయిందన్న

అక్కసుతోనే సీఎం రేవంత్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం నేమ్  బోర్డులు తయారు చేయించుకొని ఇంట్లో పెట్టుకొని తృప్తిపడాలని సూచించారు. కేటీఆర్  పార్టీ ఇన్ చార్జిగా ఉన్నప్పుడే మల్కాజ్ గిరిలో రేవంత్  ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారని గుర్తుచేశారు. నేరస్తులే పరామర్శకు వెళ్లినట్లు కేటీఆర్  మేడిగడ్డ టూర్  ఉందని విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మంద శ్యామేల్  మాట్లాడుతూ రేవంత్ రూపంలో కేటీఆర్ కు అసలైన మగాడు దొరికారని అన్నారు. కేటీఆర్  అమెరికా నుంచి వస్తే, రేవంత్  ప్రజల గుండెల నుంచి వచ్చారన్నారు.

తమ ప్రభుత్వం జోలికి వస్తే తేనెటీగల్లా చుట్టుముడతామని హెచ్చరించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్  నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని హితవు పలికారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో  లోక్ సభ ఎన్నికల తర్వాత అక్కడికే పోవడం ఖాయమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తామన్నారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, రానున్న పదేండ్ల పాటు రేవంతే సీఎంగా ఉంటారన్నారు. ఇష్టంవచ్చినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ఏ ముఖం పెట్టుకొని మేడిగడ్డకు వెళ్లారని కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు.