- అక్రమ నియమకాలపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు
- రద్దు చేసి తిరిగి భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నల్గొండ, వెలుగు: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగినటలు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా నియామకాలు జరిగినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మూడు ఏజెన్సీలను డ్రా పద్ధతిలో ఎంపిక చేసి పోస్టులను కేటాయించాలి. కానీ, జీఎస్టీ చెల్లింపుల వివాదం తలెత్తడంతో ఎల్-1 ఏజెన్సీగా ఉన్న అంబేద్కర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.
ఎల్-1 ఏజెన్సీ తప్పుకున్నప్పుడు ఎల్-3 ఏజెన్సీకి అవకాశం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఎల్-2 గా ఉన్న భార్గవి ఎంటర్ ప్రైజెస్ కే అదనపు పోస్టులు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఏజెన్సీ ద్వారా 100కు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోయినా, అదే ఏజెన్సీతో నియామకాలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.
రూ.లక్షల్లో వసూళ్లు..
గతంలో దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరిగేవని, కానీ, ఈసారి ఎలాంటి పారదర్శకత పాటించలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారని చెబుతున్నారు. జిల్లాకు చెందిన ఒక కీలక నేత అనుచరులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, తమకు అనుకూలంగా నియామకాలు జరిపించారని విమర్శిస్తున్నారు.
మే నెలలో 41 పోస్టుల భర్తీకి అనుమతి ఉండగా, 50కి పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ఆరోపణలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్లు పాటించలేదని చెబుతున్నారు. వయోపరిమితి సడలింపులను పరిగణనలోకి తీసుకోలేదని, వీసీగా ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వచ్చిన తరువాత నోటిఫికేషన్ ఇవ్వకుండా 33 మందిని అక్రమంగా నియమించారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నత విద్యామండలిని ఆశ్రయించారు. అక్రమంగా భర్తీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రద్దు చేసి, సంబంధిత ఏజెన్సీలపై, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.
