ఊర మాస్ గెటప్‌‌‌‌లో హీరో నాని

ఊర మాస్ గెటప్‌‌‌‌లో హీరో నాని

మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్‌‌‌‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌‌‌లో ‘దసరా’ చిత్రంలో నటిస్తున్న తను.. డీ గ్లామర్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  దసరా సందర్భంగా ఫ్యాన్స్‌‌‌‌కి పండుగ విషెస్ చెబుతూ ‘ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం’ అనే సాంగ్‌‌‌‌ను  రిలీజ్ చేశారు.  సంతోష్ నారాయణన్ ట్యూన్ చేసిన పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడిన తీరు ఆకట్టుకుంది. ‘పవ్వగొట్టు పవ్వగొట్టు.. బోటి కూర దానంచుకుపెట్టు. బ్యాండు కొట్టు బ్యాండు కొట్టు.. వాడకట్టు లేసూగేటట్టు’ అంటూ కల్లు కాంపౌండ్‌లో చిందులేస్తున్నాడు నాని.  ‘కంట్రోల్ బియ్యం, కారం మెతుకుల్, చుట్టూరా దోస్తుల్, గివ్వే మా ఆస్తుల్..అంబలి గట్క, మాది రాచ పుటక.. పూట పూట మాకే దసరా. జమ్మిని బొగ్గుని బంగారమే అంటాం.. బంగారంలాంటి మనుషుల్లో ఉంటాం’ అని సింగరేణి  కార్మికుల వ్యక్తిత్వాన్ని,  పండుగ వాతావరణాన్ని తలపించేలా లిరిక్స్ రాశాడు కాసర్ల శ్యామ్. పాట మధ్యలో గొట్టే కనకవ్వ పాడిన బతుకమ్మ పండుగను కూడా చూపిస్తూ తెలంగాణ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు ప్రెజెంట్ చేశారు.

బొగ్గు గనుల్లో నాని, తన ఫ్రెండ్స్‌‌‌‌తో చిందులేస్తూ మాసియెస్ట్ స్టెప్పులతో  ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇందులో నాని తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నాడు.  కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.