
డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నాని. తాజాగా తను సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమతో మనసు నిండిపోయింది’ అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అసలు విషయానికొస్తే.. తన కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఐదేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ మూవీ వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్ షో వేశారు. ఈ షోకు నాని తన ఫ్యామిలీతో వెళ్లాడు. ఈ సినిమాపై ఇప్పటికీ అభిమానాన్ని చూపిస్తూ థియేటర్‌లో ఈలలు, కేకలతో సందడి చేయడంతో తనకి ఆశ్చర్యం వేసిందంటూ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ సైతం వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నాని.. గౌతమ్ తిన్ననూరితో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.