- నిర్వాసితులు, గ్రామస్తుల మధ్య తోపులాట, ఉద్రిక్తత
గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న ఇళ్లు, భూముల సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలని గ్రామస్తులు, తమ ఇండ్లను సర్వే చేయనివ్వాలని నిర్వాసితులు పేర్కొనడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా చెరువు కట్ట కింద ఉన్న 30 ఇండ్లు ముంపునకు గురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇదిలాఉంటే చెరువు నిండితే ఊరంతా జాలు పారుతోందని, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని ఊరు మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలని గ్రామస్తులు కొన్నేళ్లుగా విన్నవించుకుంటున్నారు.
ఈక్రమంలో శుక్రవారం భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి గ్రామానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు విన్నవించారు. ఇదిలాఉంటే శనివారం ముంపునకు గురవుతున్న ఇండ్లను సర్వే చేసేందుకు అధికారులు గ్రామానికి రాగా, కొన్ని ఇండ్లను మాత్రమే ముంపు కింద తీసుకుంటే సర్వే చేయనివ్వమని అధికారుల వాహనాల ముందు గ్రామస్తులు బైఠాయించారు.
అదే సమయంలో ముంపునకు గురవుతున్న ఇండ్ల నిర్వాసితులు అక్కడికి చేరుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి తోపులాట వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న ఎస్సై వంశీకృష్ణ గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. సర్వేకు వచ్చిన అధికారులు వెనక్కి వెళ్లిపోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఘటనపై గంగాధర పోలీస్ స్టేషన్‌లో నిర్వాసితులు, నిర్వాసేతరులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
