మక్తల్/ ఊట్కూర్, వెలుగు: ప్రకృతి వ్యవసాయ సాగుపై దృష్టి సారించాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శనివారం మక్తల్మండలంలోని జక్లేర్ వద్ద నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. రైతులు వరి, పత్తి లాంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా కూరగాయలు, ఆయిల్ పామ్, పండ్ల తోటల సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.
ప్రకృతి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటుందని, ముఖ్యంగా పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఎప్పీఓ, ఎస్ హెచ్ జీల ద్వారా అనుసంధానం చేస్తామని, ఆర్గానిక్ ట్యాగ్‌తో విక్రయించేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.
అనంతరం ఊట్కూర్ మండలంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన కలెక్టర్, వేసవి దృష్ట్యా కూలీలు ఉదయం 5.30 గంటలకే పనులకు హాజరై ఎండ ముదిరేలోపే తిరిగి వెళ్లాలని సూచించారు. ఉపాధి క్షేత్రాల వద్ద కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లాంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
