దేశ వారసత్వ సంపదను ఆ పార్టీ పట్టించుకోలేదు: మోదీ

దేశ వారసత్వ సంపదను ఆ పార్టీ పట్టించుకోలేదు: మోదీ
  •     అయోధ్య ఆలయం పూర్తయినా విద్వేషాలు రెచ్చగొడుతున్నరని ఫైర్ 
  •     గుడులతోపాటు, పేదలకు ఇండ్లూ కట్టిస్తున్నామన్న పీఎం 

మెహ్ సానా: కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ విద్వేష మార్గమేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆ పార్టీ అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. గురువారం గుజరాత్ లో పర్యటించిన మోదీ మెహ్ సానా జిల్లాలో కట్టిన వాలినాథ్ మహదేవ్ గుడిని ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.8,350 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. మన దేశ వారసత్వ సంపదను కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ఆ పార్టీ.. దేశ వారసత్వ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ‘‘పవిత్ర సోమనాథ్ ఆలయంపై కాంగ్రెస్ వివాదాలు సృష్టించింది. రాముడి ఉనికిపై ప్రశ్నలు లేవనెత్తింది. అయోధ్యలో రామమందిరం నిర్మించకుండా అడ్డంకులు సృష్టించింది. ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది. 

దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడూ నెగెటివ్ గా ఆలోచించేటోళ్లు.. ఇంకా విద్వేషాన్ని వీడడం లేదు” అని ఫైర్ అయ్యారు. ఇవన్నీ ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ చేసిందని మండిపడ్డారు. ‘‘ఓవైపు దేవాలయాలను నిర్మిస్తూనే, మరోవైపు పేదలకు ఇండ్లు కట్టిస్తున్నం. అభివృద్ధి చేస్తూనే వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నం” అని తెలిపారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు దీసా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రన్ వే నిర్మించాలని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలు రాశాను. దేశ భద్రతకు ఇది ముఖ్యమని చెప్పాను. కానీ వాళ్లు పట్టించుకోలేదు. నేను ఏడాదిన్నర కింద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను” అని ప్రధాని అన్నారు.   

అమూల్ నంబర్ వన్ కావాలె.. 

మన దేశంలో పాడి పరిశ్రమ ఏటికేడు అభివృద్ధి చెందుతున్నదని మోదీ తెలిపారు. డెయిరీ సెక్టార్ గ్రోత్ రేట్ ప్రపంచవ్యాప్తంగా 2 శాతం ఉంటే, మన దేశంలో 6 శాతం ఉందన్నారు. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకలు గురువారం అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో నిర్వహించారు. దాదాపు లక్ష మంది రైతులు హాజరయ్యారు. దీనికి మోదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘ప్రస్తుతం అమూల్ (జీసీఎంఎంఎఫ్) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా ఉంది. దీన్ని నంబర్ వన్ కు తీసుకురావాలి. మీకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది. ఇది మోదీ గ్యారంటీ” అని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఇండియా అవతరించిందని, మన దేశంలో డెయిరీ సెక్టార్ వార్షిక టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు చేరిందన్నారు. కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. 

మార్చి 6న ‘సందేశ్​ఖాలీ’ మహిళలతో మోదీ మీటింగ్ 

ప్రధాని మోదీ మార్చి 6న పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బరాసత్ లో నిర్వహించే మహిళల ర్యాలీలో ప్రధాని పాల్గొంటారని బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తెలిపారు. గురువారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ..  ‘‘సందేశ్ ఖాలీ బాధిత మహిళలు మోదీని కలిసేందుకు సుముఖంగా ఉంటే మీటింగ్ ఏర్పాటు చేస్తాం” అని చెప్పారు. కాగా, సందేశ్ ఖాలీలో టీఎంసీ లీడర్ షాజహాన్ షేక్, అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, భూములు ఆక్రమించుకుంటన్నారని స్థానిక మహిళలు ఆందోళన చేస్తున్నారు.