బేఫికర్​గా ఉండాలంటే ఇండియాలో ఇన్వెస్ట్​ చేయండి

బేఫికర్​గా ఉండాలంటే ఇండియాలో ఇన్వెస్ట్​ చేయండి

‘ఇండియా--డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్’లో ప్రధాని మోడీ
బిజినెస్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
దేశంలో పెట్టుబడులు పెట్టకపోతే.. మిస్ అయ్యామన్న దిగులు తప్పదని కామెంట్  
డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ తో భేటీ   

ఇండియాలో పెట్టుబడులు పెడితే ఎలాంటి చింత ఉండదు. పెట్టుబడులతో మా దేశానికి రండి. మేం తెచ్చిన సంస్కరణల గురించి ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నా. ఇండియాలో ఇన్వెస్ట్ చేయకపోతే మాత్రం ‘అయ్యో.. మిస్ అయిపోయామే..’ అని మీరు తప్పకుండా చింతించాల్సి వస్తుంది. ఉక్రెయిన్ లో వెంటనే కాల్పులను ఆపివేయాలి. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలి. 

కోపెన్ హేగన్ (డెన్మార్క్) :  ఇండియాలో పెట్టుబడులు పెడితే ఎలాంటి చింత చేయాల్సిన అవసరం ఉండబోదని అంతర్జాతీయ బిజినెస్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బేఫికర్​గా ఉండాలని అనుకుంటే ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు. జర్మనీ పర్యటన ముగించుకున్న మోడీ మంగళవారం మధ్యాహ్నం డెన్మార్క్ రాజధాని కోపెన్ హేగన్ కు చేరుకున్నారు. ఆయనకు డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ ఘనంగా స్వాగతం పలికారు. ఇద్దరు ప్రధానులు భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ‘ఇండియా–-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్’లో పాల్గొన్నారు. రెండు దేశాల బిజినెస్ లీడర్లు హాజరైన ఈ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇండియాలో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయం ఎలా అవుతుందో తెలియజేశారు. ‘‘ఈ రోజుల్లో ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) అనే పదం సోషల్ మీడియాలో విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. జీవితంలో ఏదైనా ఒక మంచి అవకాశాన్ని మిస్ అవుతామన్న బుగులు (ఫోమో)ను మీరు విడిచిపెట్టండి. ఇండియాలో పెట్టుబడులు పెట్టండి. ఇండియాలో తెచ్చిన రిఫామ్స్, పెట్టుబడి అవకాశాలను బట్టి నేను ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నా. మా దేశంలో ఇన్వెస్ట్ చేయకపోతే మాత్రం ‘అయ్యో.. మిస్ అయిపోయామే..’ అని మీరు తప్పకుండా చింతించాల్సి వస్తుంది” అని మోడీ చెప్పారు.  ప్రధాని మోడీ డెన్మార్క్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో డెన్మార్క్ రాణి క్వీన్ మార్గ్రెథే 2ను కూడా మోడీ కలవనున్నారు. డెన్మార్క్, ఐస్ ల్యాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు హాజరయ్యే ‘2వ ఇండియా-నార్డిక్ సమిట్’లో కూడా మోడీ పాల్గొననున్నారు. 

పెట్టుబడులు, వాణిజ్యం పెరిగినయ్ 
ఇండియా, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ వల్ల వాణిజ్యం, పెట్టుబడులు పెరిగాయని ప్రధానులు మోడీ, ఫ్రెడరిక్సన్ తెలిపారు. ఇండియాలో గ్రీన్ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం కోసం ప్రారంభించిన ‘ఇండియా గ్రీన్ ఫైనాన్స్ ఇనీషియేటివ్’నూ ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. దీనివల్ల దేశంలో పర్యావరణ హిత టెక్నాలజీల అమలుతో పాటు ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు. డైరీతో పాటు వ్యవసాయంపై సహకారం కోసం కూడా ఒక అంగీకారానికి వచ్చినట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు. మంగళవారం ఇద్దరు ప్రధానులు భేటీ అయిన సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీపై చర్చలు జరిపామని, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను మరింత పెంచుకోవాలని అంగీకారానికి వచ్చామని తెలిపారు. ‘‘ఇండియా, డెన్మార్క్ వ్యాపారవేత్తలు గతంలోనూ కలిసి పని చేశారు. రెండు దేశాలు ఒకదానికి ఒకటి బలం. గ్రీన్ టెక్నాలజీలో పెట్టుబడులకు, కోల్డ్ చైన్స్, షిప్పింగ్, పోర్టుల్లోనూ ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి” అని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీ మెంబర్లను ప్రత్యేకంగా కలిసి ప్రధాని నరేంద్ర  మోడీ మాట్లాడారు.   

యుద్ధం వెంటనే ఆపాలె
ఉక్రెయిన్ లో వెంటనే కాల్పులను ఆపివేయాలని ప్రధాని మోడీ మరోసారి విజ్ఞప్తి చేశారు. తిరిగి చర్చలు ప్రారంభించాలని, దౌత్య మార్గంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మంగళవారం ఫ్రెడరిక్సన్ తో భేటీ అయిన తర్వాత ఇద్దరు ప్రధానులు మీడియాతో మాట్లాడారు. తామిద్దరమూ ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించామని, వెంటనే కాల్పుల విరమణ పాటించాలని కోరామని మోడీ చెప్పారు. అయితే, రష్యాపై ఇండియా తన ఇన్ఫ్లూయెన్స్ ను ఉపయోగించి యుద్ధాన్ని నిలిపివేయిస్తుందని, ఈ హత్యలకు ముగింపు పలికేలా చూస్తుందని ఆశిస్తున్నట్లు ఫ్రెడరిక్సన్ చెప్పారు. పుతిన్ ఈ యుద్ధాన్ని ఆపి తీరాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.