ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలె : సీఎం కేసీఆర్

ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలె : సీఎం కేసీఆర్

ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ పై లోక్ సభ, రాజ్యసభలో తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కేంద్రం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబ‌ద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల‌ను ముప్పుతిప్పలు పెడుతూ, ప‌ని చేయ‌నీయ‌డం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో చాలా సంద‌ర్భాల్లో నాన్ బీజేపీ ప్రభుత్వాల వెంబ‌డి ప‌డుతూ.. ర‌క‌ర‌కాల దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ హయంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

‘‘ఢిల్లీలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్‌ను తెచ్చి ఊపిరాడ‌కుండా, అనేక దుర్మార్గ చ‌ర్యల‌కు కేంద్రం పాల్పడుతోంది. కేజ్రీవాల్ గ‌వ‌ర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ప్రజ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్రభుత్వం కింద‌నే అధికారులంద‌రూ ప‌ని చేయాల్సి ఉంటుంది. క‌చ్చితంగా ప్రభుత్వం చెప్పిన‌ట్లు వినాలి. గ‌వ‌ర్నర్ల చేతుల్లో ఉండ‌రాదు అని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్‌ను కూడా కాల‌రాశారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఇవాళ భ‌యంక‌రంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ఎమ‌ర్జెన్సీ రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఎమ‌ర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేత‌లు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇందిరాగాంధీ అమ‌లు చేసిన ఎమ‌ర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోంది. బీజేపీకి ఢిల్లీ ప్రజ‌లు మ‌రోసారి త‌గిన బుద్ధి చెబుతారు. కేంద్ర ప్రభుత్వం ఒక ర‌కంగా ఢిల్లీ ప్రజ‌ల‌ను అవ‌మానిస్తోంది’’ అని కేసీఆర్ మండిప‌డ్డారు.

ఢిల్లీలో ఆప్ పార్టీకి మేయర్ పీఠం కాకుండా బీజేపీ చాలా కుట్రలు చేసిందన్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ మేయర్ పీఠాన్ని అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గర్నవర్ ను తీసుకొచ్చే దుర్మార్గ ప్రయత్నాలకు బీజేపీ తెరతీసిందన్నారు. ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను (బీజేపీ, కాంగ్రెస్) కేజ్రీవాల్ మట్టి కరిపించారని వ్యాఖ్యానించారు. ఆప్ కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా కుట్ర చేశారని చెప్పారు. 

అంతకుముందు.. మే 27వ తేదీ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైదరాబాద్ కు చేరుకుని.. సీఎం కేసీఆర్ తో సమావేశమైయ్యారు. కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంలతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్. అనంతరం కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై చర్చించారు. 

ఇక ఇటీవలే ఢిల్లీకి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆప్ అధినేత కేజ్రీవాల్ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే... మరోవైపు విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక‌రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలతో భేటీ అయ్యారు.