కూలీల లగేజీలతో ఉడాయించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ల అరెస్ట్

కూలీల లగేజీలతో ఉడాయించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ల అరెస్ట్

నార్కట్ పల్లి, వెలుగు: అస్సాం కూలీలను దారి మధ్యలో వదిలేసి వారి లగేజీతో సహా పరారైన కేరళకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్​లో సీఐ శంకర్ రెడ్డితో కలిసి డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

అస్సాంకు చెందిన 62 మంది కూలీలు కేరళలోని ఎర్నాకుళం వెళ్లారు. అక్కడ పనులు పూర్తయిన తర్వాత సొంత గ్రామానికి వెళ్లేందుకు కేరళలో ట్రావెల్స్ బస్సు బ్రోకర్లు అఖిల్, సుమన్ ద్వారా ప్రైవేట్ బస్సు ఈ నెల 3న బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 3,5‌‌‌00 చొప్పున ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ నెల 5న నార్కట్ పల్లిలోని హోటల్ వద్ద భోజనం కోసం బస్సు ఆపారు. ఆ సమయంలో బస్సు పంక్చర్ అయింది, చేసుకువస్తానంటూ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నార్కట్​పల్లి పోలీసులు నిందితుల ఆచూకీ కోసం కేరళ వెళ్లి బ్రోకర్ల ద్వారా వెతికారు. గురువారం ఉదయం పంతంగి టోల్ గేట్ వద్ద వెహికల్స్​తనిఖీలో బస్సును గుర్తించారు. నలుగురు నిందితులు కేలట సంతోష్​ సనత్, పునప్​పులి ప్రశాంత్, విమల్, అశ్విన్ ను అరెస్ట్​చేశారు. కేసును త్వరగా సాల్వ్​చేసిన ఎస్సై భీమబోయిన యాదయ్య, కానిస్టేబుల్ జానకి రాములు, లింగరాజు, షరీఫ్ ను డీఎస్పీ అభినందించారు.