- మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశంలో పేద, ధనిక తేడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, సర్కారు తీరుతో జనం మధ్య ఐక్యత దెబ్బతింటోందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నోడికేమో రాయితీలు.. లేనోడికేమో తిప్పలు అన్నట్టు పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మంగళవారం టీఎస్ యూటీఎఫ్ సీనియర్ నేత ఎంఏకే దత్తు రెండో వర్ధంతి సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న పేద, మధ్యతరగతి జనానికి బడ్జెట్ లో 10 శాతం నిధులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇద్దరు, ముగ్గురు కార్పొరేట్లకు మాత్రం 40 శాతానికి పైగా రాయితీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాన్ని సర్కారు గాలికొదిలేసిందని, దీంతో అవి పేదోడికి అందని ద్రాక్షలా మారాయని ఆరోపించారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. కేంద్రం ఎన్ఈపీ 2020 పేరుతో విద్యారంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను బతికించుకునేందుకు పోరాటమే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
