సూర్యగ్రహణం ఎఫెక్ట్ : బోసిపోయిన నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

సూర్యగ్రహణం ఎఫెక్ట్ :  బోసిపోయిన నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

రంగారెడ్డి జిల్లా నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. నిత్యం రద్దీతో జనాలతో కలకళలాడే ఆఫీస్ సూర్య గ్రహణం కారణంగా ఇలా జనం లేక వెలవెలబోయింది. అంతే గాకుండా ఇవాళ సూర్యగ్రహణం, అమావాస్య, మంగళవారం మూడు కలిసి రావడంతో ఎవరూ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సాయంత్రం 5 గంటల వరకు ఐదు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని అధికారులు చెబుతున్నారు. నిత్యం జనాలతో కిక్కిరిసిపోయే ఆఫీస్ లో ఒక్కరూ కనిపించలేదని తెలిపారు. 

ప్రతిరోజు నార్సింగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో 40 నుంచి 50 వరకు రిజిస్ట్రేషన్లు అవుతాయి. సూర్యగ్రహణం ఎఫెక్ట్ తో జనాలు ఎవ్వరూ రాలేదు. మరోవైపు పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్యుమెంట్ రైటర్లు కూడా ప్రజలు రాకపోవడతో మధ్యాహ్నం రెండు గంటలకే దుకాణాలు బంద్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. కానీ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం కార్యాలయంలో ఐదు గంటల వరకు వేచి ఉన్నారు.