Nathan Lyon: ఇండియాలో సిరీస్ గెలవాలి.. రిటైర్మెంట్‌పై 556 టెస్ట్ వికెట్ల వీరుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Nathan Lyon: ఇండియాలో సిరీస్ గెలవాలి.. రిటైర్మెంట్‌పై 556 టెస్ట్ వికెట్ల వీరుడు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియాన్  37 ఏళ్ళ వయసులో కూడా టెస్ట్ క్రికెట్ లో సత్తా చాటుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మ్యాచ్ ఎక్కడ జరిగినా కూడా ఆసీస్ తుది జట్టులో లియాన్ ఉండాల్సిందే. షేన్ వార్న్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి 14 ఏళ్లుగా కంగారూల జట్టు స్పిన్ బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నాడు. కెరీర్ లో 138 టెస్టులు.. 556 వికెట్లు.. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఘనతలు.. ఒక ఆటగాడిగా ఇంతకన్నా ఏం కావాలి. వయసు మీద పడడంతో ఈ ఆసీస్ వెటరన్ స్పిన్నర్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తాడేమో అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

లియాన్ తాజాగా తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. 37 ఏళ్ల ఈ అనుభవజ్ఞుడు తన కెరీర్ ముగిసేలోపు ఇంగ్లాండ్, ఇండియాలో సిరీస్ గెలవడంతో పాటు మరో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలవాలనే లక్ష్యాలను పెట్టుకున్నాడు. 2023లో భారత్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా తొలిసారి డబ్యూటీసీ గెలిచినప్పుడు లియాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.   గత నెలలో లార్డ్స్‌లో సౌతాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. 

లియాన్ మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఇండియాలో సిరీస్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంటాను. ఇండియాతో పాటు ఇంగ్లాండ్ లోనూ గెలవాలి. కొన్ని సార్లు సిరీస్ గెలిచే అవకాశం వచ్చినా చేజారింది. ప్రతి టెస్ట్ కీలకంగా తీసుకోవాలి. సమ్మర్ లో జరగబోయే యాషెస్ నా ఆలోచనల్లో ఉంది. మరో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఖచ్చితంగా ఆడాలనే లక్ష్యం ఉంది". అని లియాన్ తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

►ALSO READ | Sourav Ganguly: ఇండియన్ క్రికెట్ గురించి ఆందోళన లేదు.. వారిద్దరూ ముందుకు తీసుకెళ్తారు

లియాన్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 138 టెస్టుల్లో 556 వికెట్లు పడగొట్టాడు. షేన్ వార్న్ (708), ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (563) తర్వాత ఆస్ట్రేలియన్ బౌలర్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు. లియాన్ మరో 8 వికెట్లు పడగొడితే మెక్‌గ్రాత్ (563) ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఓవరాల్ గా లియాన్ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.