
- దేశంలో 24% మందికి ఒబేసిటీ
- పట్టణాల్లో 29.8%, గ్రామాల్లో 19.3%
- కరోనా తర్వాత పెరిగిన సమస్య
- లాక్ డౌన్.. శారీరక శ్రమ తగ్గడమే కారణం
- ప్రతి పది మందిలో ముగ్గురికి ఊబకాయం
- తెలంగాణలో 32% పురుషులకు ఒబేసిటీ
- నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5వెల్లడి
హైదరాబాద్: ట్రంకు పెట్టెల్లా బాడీలు.. బాన పొట్టలు.. అసలు వయసుకు బాడీకీ సంబంధమే లేదు... లావైపోతున్నారు! దేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం ఇందుకు కారణమని తెలుస్తోంది. 2019-2021 మధ్యకాలంలో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే నివేదికలో ఈ సమస్యను ప్రస్తావించింది.
భారతీయుల్లో ఊబకాయం ఎంత మేర పెరిగిందో గణాంకాలతో సహా వివరిస్తూ.. అందుకు దారితీసిన పరిస్థితులపైనా విశ్లేషించింది. ప్రతి పది మంది భారతీయుల్లో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంది. దేశ జనాభాలో 18-69 ఏళ్ల వయస్సు మధ్య గల స్త్రీ, పురుషులపై ఈ సర్వే నిర్వహించింది.
సగటున దేశంలో 22.9 శాతం మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతుండగా.. 24% మంది మహిళలు ఊబకాయంతో ఉన్నారు. పురుషుల్లో ఊబకాయం గతంలో 18.9 శాతం ఉండగా.. అది ఇప్పుడు 4% పెరిగి, 22.9 శాతానికి చేరుకుంది. మహిళల్లోనూ స్థూలకాయం 20.6% నుంచి 24%కు పెరిగింది. దాదాపు స్త్రీ, పురుషులిద్దరిలో 4% మేర ఊబకాయం సమస్య పెరిగిందని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. స్థూలకాయం సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది.
Also Read:-ఢిల్లీ మెట్రోలో మళ్లీ అమ్మాయి రచ్చ.. డ్యాన్స్.. తరువాత ఫ్లైయింగ్ కిస్
ఆంధ్రప్రదేశ్‌లో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 36.3 శాతం మంది ఉండగా.. పురుషులు 31.1 శాతం ఉన్నారు. తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం ఉండగా.. పురుషులు 32.3 శాతం మంది ఉన్నారు. ఏపీలో పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ ఊబకాయం సమస్య ఉంటే, తెలంగాణలో అందుకు భిన్నంగా పురుషుల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంది.
పరేషాన్ చేసిన లాక్ డౌన్
2019–2021 మధ్య కాలంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశంలో ఊబకాయస్థుల సంఖ్య పెరిగినట్టు సర్వే నివేదించింది. అదే సమయంలో ఆరోగ్యం కోసం ఎడాపెడా తినేయడం కూడా ఊబకాయానికి కారణమైందని విశ్లేషించింది. ఒబేసిటీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో అధిక బరువుతో బాధపడేవారు 19.3 శాతం ఉండగా, నగరాలు, పట్టణాల్లో 29.8 శాతం మంది ఊబకాయులేనని నివేదికలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల వారు వ్యవసాయం, లేదా వృత్తులు చేస్తున్నందున శారీరక శ్రమ కారణంగా లావెక్కడం లేదనే వాదన బలంగానే వినిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న వృద్ధుల జనాభాతో పాటు ఒబేసిటీ ఆందోళన కల్గిస్తోంది.
బద్ధకం.. అనారోగ్యకర ఆహారం
సోషల్ మీడియా, బద్ధకపు అలవాట్లు, అనారోగ్యానికి దారితీసే ఆహారం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని తద్వారా దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం ఉంటుందని సర్వే పేర్కొంది. అధిక చక్కెర, కొవ్వు ఉన్న ప్రాసెస్‌డ్ ఫుడ్ తీసుకునే అలవాటు పెరిగిందని, సగానికి పైగా అనారోగ్య సమస్యలకు ఈ తరహా ఆహారపు అలవాట్లే కారణమని తెలిపింది.
ఈ తరహా టాక్సిక్ అలవాట్లకు ప్రైవేట్ రంగమే ప్రధాన కారణమని తెలిపింది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ప్రకారం, భారత్‌లోని పెద్దల్లో ఊబకాయం రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా. ఇది చిన్నారుల్లోనూ వేగంగా నమోదవుతోందని, ప్రపంచవ్యాప్తంగా వియత్నాం, నమీబియా తర్వాత భారత్ నిలిచిందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
ఊబకాయంతో బాధపడుతున్న వారి శాతం
రాష్ట్రం మహిళలు పురుషులు
ఢిల్లీ 41.3 38
తమిళనాడు 40.4 37
ఆంధ్రప్రదేశ్ 36.3 31.1
తెలంగాణ 30.1 32.3