హనుమకొండ, ధర్మసాగర్, వెలుగు: కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహిస్తోన్న నేషనల్ సీనియర్స్ ఖోఖో చాంపియన్ షిప్ పోటీలు తుది దశకు చేరాయి. ఒడిశా పురుషులు, మహిళల జట్లు జోరు కొనసాగించి సెమిస్ కు చేరగా.. తెలుగు రాష్ట్రాల జట్లు క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాయి. బుధవారం మ్యాచ్ లను ఇండియా ఖోఖో ఫెడరేషన్ చైర్మన్ ఎంఎస్ త్యాగి, ప్రధాన కార్యదర్శి ఉపకార్ సింగ్, ఎథిక్స్ కమిషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రారంభించారు.
వివిధ రాష్ట్రాల క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. పురుషుల విభాగంలో డిపెండింగ్ చాంపిన్ రైల్వేస్ జట్టు కర్నాటకపై 23 –-15 తేడాతో గెలుపొందింది. ఒడిశా, కొల్హాపూర్, మహారాష్ట్ర టీమ్స్ సెమీస్ కు చేరాయి. పోటీలను ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, నిర్వహణ కార్యదర్శి తోట శ్యాం ప్రసాద్, రాజారపు రమేశ్ పర్యవేక్షించారు. పురుషుల విభాగంలో గురువారం రైల్వేస్ టీమ్ ఒడిశాతో, కొల్హాపూర్ టీమ్ మహారాష్ట్రతో పోటీ పడతాయి. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ మహారాష్ట్ర, ఢిల్లీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఒడిశా జట్లు సెమీస్ కు వెళ్లాయి. సెమీస్ లో మహారాష్ట్ర జట్టు ఢిల్లీతో, ఒడిశా టీమ్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో తలపడతాయి.
